Dude Review

Dude Review: డ్యూడ్.. యూత్ ని ఫిదా చేసిందా?

Dude Review: ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి విజయాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ దీపావళికి ‘డ్యూడ్’ సినిమాతో బాక్సాఫీస్ వద్దకు వచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించింది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా ప్రచారం పొందిన ఈ సినిమా, ప్రదీప్‌కి మూడో విజయాన్ని అందించిందా? అసలు కథ ఏంటి?

కథాంశం ఏమిటంటే?
పశుసంవర్ధక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కూతురు కుందన (మమిత బైజు). చిన్నప్పటి నుంచీ మేనత్త కొడుకు గగన్ (ప్రదీప్ రంగనాథన్) అంటే కుందనకు ఎంతో ప్రేమ. అయితే, గగన్ స్కూల్, కాలేజీలలో వేరే అమ్మాయిలను ప్రేమించి, రెండుసార్లు బ్రేకప్‌లతో నిరాశలో ఉంటాడు. ఈ క్రమంలో కుందన తన ప్రేమను వ్యక్తపరిచి పెళ్లి చేసుకోవాలని కోరినా, గగన్ నిరాకరిస్తాడు.

దీంతో బెంగళూరు వెళ్లిన కుందనపై గగన్‌కు ప్రేమ చిగురుతుంది. ఆమె తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ, ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. కుందన మనసులో మరో యువకుడు (పార్ధు – హృదయ్ హరూన్) ఉన్నాడని తెలుసుకున్న గగన్, ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. అనూహ్య పరిస్థితుల మధ్య గగన్, కుందన పెళ్లి జరుగుతుంది. అయితే, భార్య మనసులో ఉన్న వ్యక్తితో ఆమెను ఎలా కలపగలిగాడు? మధ్యలో మంత్రి ఆదికేశవులు కుల పిచ్చి, పరువు హత్యల నేపథ్యం, ఒక బిడ్డకు జరగాల్సిన న్యాయం వంటి అంశాలు ఏమిటి? అనేదే మిగిలిన కథ. 1998 నాటి ‘కన్యాదానం’ కథాంశాన్ని ఆధునిక హంగులతో దర్శకుడు కీర్తీశ్వరన్ తెరకెక్కించే ప్రయత్నం చేశారు.

‘డ్యూడ్’ చిత్రం సరదాగా మొదలైనా, ద్వితీయార్థంలో ఎక్కువ భాగం భావోద్వేగాల (ఎమోషన్)తో, త్యాగాలతో కూడిన సీరియస్ డ్రామాగా మారుతుంది. ‘ఆర్య 2’ స్ఫూర్తితో కథ రాసుకున్నామని దర్శకుడు చెప్పినప్పటికీ, అందులో ఉన్నంత గాఢమైన భావోద్వేగాలు ఇందులో కనిపించవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ రొటీన్‌గా, ఊహించడానికి సులువుగా అనిపించినా, క్లైమాక్స్ మాత్రం యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.

Also Read: Kriti Sanon: చరిత్ర సృష్టించిన కృతి సనన్?

నటీనటుల పనితీరు..
ప్రదీప్ రంగనాథన్: జులాయిగా మొదలై, ప్రేమించిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పరిణతి గల వ్యక్తిగా గగన్ పాత్రలో ప్రదీప్ మెప్పించాడు. తన గత చిత్రాల్లోని వినోదం ఇందులో కొంత తగ్గి, త్యాగరాజు పాత్రలా కనిపించాడు.

మమితా బైజు: కుందన పాత్రలో మమితా బైజు సహజమైన నటనతో ఆకట్టుకుంది. తన అందం, హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

శరత్ కుమార్: మంత్రి ఆదికేశులుగా శరత్ కుమార్ సీరియస్, కామెడీ షేడ్స్‌తో కూడిన తండ్రి పాత్రలో ఒదిగిపోయారు.

సాంకేతిక అంశాలు: సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం కొత్తగా ఉన్నా, పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

సాధారణ కథను కొత్తగా చూపించడంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడు. కులాంతర వివాహాలు, పరువు హత్యలపై ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నప్పటికీ, ‘లవ్ టుడే’ స్థాయిలో వినోదం, మళ్లీ చూడాలనే ఆసక్తి ఇందులో ఉండదనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. థియేటర్‌లో కేవలం ఒక్కసారి చూడదగిన ఎంటర్‌టైనర్‌గా ‘డ్యూడ్’ నిలుస్తుంది. బాక్సాఫీస్ వద్ద ఈ త్యాగాల కథ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *