Prabhas: ప్రభాస్ పేరు వింటే చాలు జనానికి ముందుగా గుర్తుకు వచ్చేది ‘బాహుబలి’నే… ఆ ఒక్క సినిమాతో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియాగా మారిపోయారు ప్రభాస్… ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా అభిమానుల మదిలో మాత్రం ‘డార్లింగ్’గానే నిలచి ఉన్నారు.
ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఏ ఇండియన్ స్టార్ చూడని వైభవం ప్రభాస్ సొంతమయిందని చెప్పవచ్చు… రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితమైన తొలి ఆంగ్లేతర చిత్రం ‘బాహుబలి’… సో, ఆ తీరున మన ‘బాహుబలి’ ప్రభాస్ ను ‘ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’ అనక తప్పదు… అంతేకాదు, ప్రభాస్ మంచి మనసు సైతం అందరినీ ఆకర్షిస్తోంది… దాతృత్వంలోనూ ‘బాహుబలి’నే అనిపించుకున్న ప్రభాస్ కు జనం జేజేలు పలుకుతున్నారు… కరోనా కల్లోల సమయంలోనూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ప్రభాస్ భారీగా విరాళమిస్తున్నారు… రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన ప్రకృతి బీభత్సానికి కరిగిపోయి ఒక్కో రాష్ట్రానికి కోటి రూపాయలు అందించారు… అలాగే కేరళలో ఉపద్రవానికి కూడా కోటి రూపాయలు ఇచ్చారు… అందుకే రియల్ లైఫ్ లోనూ మనసున్న బాహుబలి ప్రభాస్ అంటూ అభిమానులు కీర్తిస్తున్నారు… ‘కల్కి 2898 ఏడి’లో ప్రభాస్ కామెడీ పండిస్తూనే యాక్షన్ తో అదరహో అనిపించారు… ఆ వైనాన్ని చూసి ప్రభాస్ తనకు లభించిన ఏ పాత్రకైనా న్యాయం చేయగలరని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ అన్న పేరు వింటే చాలు తెలుగువారి ఆనందం అంబరమంటుతోంది… తెలుగువారిలో అత్యధిక అభిమానులను సొంతం చేసుకున్న నవతరం నాయకుడిగా ప్రభాస్ పేరే వినిపిస్తోంది… అన్ని వర్గాల వారి అభిమానాన్ని చూరగొంటున్న ప్రభాస్ కు మన తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు, తెలుగేతర సినీఫ్యాన్స్ లోనూ ఆదరణ పెరుగుతోంది… రోజు రోజుకూ ప్రభాస్ పై పెరుగుతోన్నఈ క్రేజ్ చూసి యావత్ భారతం అబ్బురపడుతోంది… ఈ సారి బర్త్ డే కు ప్రభాస్ నటించిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’, ‘ఈశ్వర్’, ‘రెబల్’, ‘సలార్’ చిత్రాలు రీ రిలీజ్ కావడం విశేషం!
జనం చేత జేజేలు అందుకుంటున్న ప్రభాస్ కు ఈ క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత నిస్సందేహంగా ‘బాహుబలి’ సృష్టికర్త రాజమౌళికే చెందుతుంది… ప్రభాస్ కెరీర్ ను ‘బాహుబలి’కి ముందు, తరువాత అని విభజించవలసి ఉంటుంది… అంతకు ముందు ప్రభాస్ చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, ‘బాహుబలి’ చిత్రాలు అతణ్ణి ఎవరెస్ట్ పై నిలిపాయని చెప్పక తప్పదు…

ఈ రోజున ప్రభాస్ ‘బాహుబలి’ స్టార్ గా జయకేతనం ఎగురవేయక మునుపు సరిగ్గా 22 సంవత్సరాల క్రితం తొలిసారి ‘ఈశ్వర్’గా జనం ముందు నిలిచాడు… ఆ రోజు ప్రభాస్ కు, ఇప్పటి ప్రభాస్ కు స్టార్ డమ్ లో హస్తిమశకాంతరం ఉంది… అయితే అతని మంచి తనంలో మాత్రం ఏ లాంటి మార్పు లేదనే వారు చిత్రసీమలో ఎందరో ఉన్నారు… తనకు ఎంతటి స్టార్ డమ్ లభించినా, ఎంతటి విజయాలు సొంతమయినా ప్రభాస్ మాత్రం అందరినీ ‘డార్లింగ్’ అంటూ అందరి మదిలో ‘డార్లింగ్’గానే ఉన్నాడు…
ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ నిరాశ పరచినా, రెండో చిత్రం ‘రాఘవేంద్ర’ కోసం ప్రభాస్ తపించి నటించారు… ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది… తొలి రెండు చిత్రాలు విజయాన్ని మూటకట్టుకోలేకపోయాయి… ప్రభాస్ పని అయిపోయినట్టే అనుకున్నారు చాలామంది… అయితే ప్రభాస్ మూడో చిత్రం ‘వర్షం’ ముచ్చటగొలిపే విజయాన్ని సాధించి, ప్రభాస్ ను స్టార్ హీరోగా నిలిపింది… ఈ సినిమా విజయంతో ప్రభాస్ ‘యంగ్ రెబల్ స్టార్’గా జేజేలు అందుకున్నారు.
‘వర్షం’తో తొలి విజయాన్ని చవిచూసిన ప్రభాస్ తరువాత వెరైటీ రోల్స్ కోసం ఆసక్తి చూపారు… వైవిధ్యమైన పాత్రలతో అలరించడానికి ప్రభాస్ భలేగా తపించారు… ఆ తపనలోనూ జయాపజయాలను అంతగా పట్టించుకోలేదు యంగ్ రెబల్ స్టార్… నటునిగా మార్కులు సంపాదించుకుంటూ సాగారు.
ఘనవిజయాలు సొంతమయినా, అపజయాలు పలకరించినా ప్రభాస్ అదరలేదు- బెదరలేదు… ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగారు… అరుదైన విజయాలే అతణ్ణి వెదుక్కుంటూ వచ్చాయి…
స్పాట్: ‘ఛత్రపతి’లోని థీమ్ సాంగ్ లోని ప్రభాస్ విజువల్స్.
ప్రభాస్ ను టాలీవుడ్ యంగ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా నిలిపిన చిత్రం మాత్రం ‘ఛత్రపతి’ అనే చెప్పాలి… నేడు ప్రభాస్ ను ‘బాహుబలి’గా తీర్చిదిద్దిన రాజమౌళియే అతణ్ణి ‘ఛత్రపతి’గానూ మలిచారు… ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్ బెస్ట్ గా ‘ఛత్రపతి’ చిత్రమే అతనికి విజయఛత్రం పట్టింది… అతని స్టార్ డమ్ కేటగిరీని మార్చి వేసింది…
‘ఛత్రపతి’ ఘనవిజయం తరువాత ప్రభాస్ రేంజ్ పెరిగింది… ఆయన సినిమాల కోసం కొనుగోలుదారులు క్యూ కట్టడం రెట్టింపయింది… అయినా ప్రబాస్ లో ఏలాంటి మార్పు లేదు… ఎప్పుడూ తనదైన రీతిలో చిరునవ్వులు చిందిస్తూ, సన్నిహితులను ‘డార్లింగ్’ అంటూ పిలుస్తూ సాగారు… క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాలను మురిపించే ప్రయత్నం చేయసాగారు ప్రభాస్… ఆ ప్రయత్నంలో ఎన్నెన్నో ఎత్తులు, పల్లాలు చూశారు ప్రభాస్.
కృష్ణంరాజును ‘రెబల్ స్టార్’గా అభిమానించిన వారందరూ ప్రభాస్ కు మొదటి నుంచీ వెన్నంటే ఉన్నారు… ‘యంగ్ రెబల్ స్టార్’గా ప్రభాస్ ను తమ హృదయాల్లో నింపుకొని ఆరాధించారు… వారందరూ కృష్ణంరాజు, ప్రభాస్ కలయికలో సినిమాలు చూడాలని ఆశించారు… అలాంటి వారికి “బిల్లా, రెబల్” చిత్రాలతో పెదనాన్నతో కలసి కనువిందు చేశారు ప్రభాస్.
సెంటిమెంట్ లేని లైఫ్ ఉప్పు లేని పప్పులాంటిదని అంటారు… అందుకే మన సినిమా రంగం సెంటిమెంట్స్ చుట్టూ పరిభ్రమిస్తోంది… ప్రభాస్ ను కూడా కొన్ని సెంటిమెంట్స్ వెన్నంటాయి.
తెలుగు చిత్రసీమలో పలు సెంటిమెంట్స్ చోటు చేసుకున్నాయి… అందులో ఒకటి – రాజమౌళి సినిమాతో గ్రాండ్ సక్సెస్ చూసిన స్టార్స్ కు తరువాత ఆ స్థాయి సక్సెస్ వెంటనే లభించదని జనం నమ్మిక… ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘ఛత్రపతి’ నిలచింది… ఈ సినిమా తరువాత ప్రభాస్ పలు చిత్రాల్లో అలరించినా ఆ స్థాయి సక్సెస్ మాత్రం వెంటనే దరిచేరలేదు.
పరాజయాలు పలకరించినా అదరక బెదరక తాను నమ్ముకున్న తీరునే ముందుకు సాగారు ప్రభాస్… అందరినీ అభిమానంగా ‘డార్లింగ్’ అంటూ పిలిచే ప్రభాస్ ను అదే టైటిల్ తో జనం ముందు నిలపాలని కొందరు భావించారు… ‘డార్లింగ్’గా నిలచిన ప్రభాస్ ఆ సినిమాతో ఘన విజయం అందుకోలేకపోయారు… అభిమానులను మాత్రం ‘డార్లింగ్’ సంతృప్తి పరచిందనే చెప్పాలి…
ప్రభాస్ ‘డౌన్ టు ఎర్త్ ‘ మెంటాలిటీ చిత్రసీమలో ఎంతోమందిని ఆకట్టుకుంది… అంతేకాదు వివాదాలకు దూరంగా ఉంటూ, తన వారికి దగ్గరగా ఉండడమే ప్రభాస్ నైజం.. అందుకే అందరూ అతణ్ణి ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అనీ కీర్తించారు… ఆ టైటిల్ తోనూ జనాన్ని అలరించే ప్రయత్నం చేశారు ప్రభాస్… బ్లాక్ బస్టర్ హిట్ కాకున్నా.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
‘ఛత్రపతి’ తరువాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ప్రభాస్ తన సన్నిహితులు నిర్మించిన ‘మిర్చి’తో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు… ‘మిర్చి’ సినిమా ప్రభాస్ అభిమానులను ఎంతగా మురిపించిందో చెప్పనక్కరలేదు…
చిత్రసీమ అంటేనే చిత్రం భళారే విచిత్రం అనిపిస్తూ ఉంటుంది… కొన్ని సార్లు పరాజయాలు పలకరించినా మరికొన్ని సార్లు వరుస విజయాలు వరించి వస్తాయి… అలా ప్రభాస్ ను వరుస విజయాలు పలకరించడమే కాదు, వాటిని జనం పలవరించేలా చేశాయి.
‘ఛత్రపతి’ తరువాత ‘మిర్చి’ దాకా ఆ స్థాయి సక్సెస్ ప్రభాస్ కు దక్కలేదు… అంతకు ముందు ‘బిల్లా’లో తనతో చిందేసిన అనుష్కతోనే ప్రభాస్ ‘మిర్చి’లో మరోమారు కనువిందు చేశారు… ఈ జోడీ మునుపటి కంటే మిన్నగా ఆకట్టుకోవడం విశేషం…
చిత్రమేంటో కానీ, ‘మిర్చి’ తరువాత ప్రభాస్, అనుష్క నటించిన ‘బాహుబలి’ రెండు భాగాలు సైతం బంపర్ హిట్స్ అయ్యాయి… ‘బాహుబలి’ మొదటి భాగంలో ప్రభాస్ కు తల్లిగా కనిపించిన అనుష్క, తరువాతి భాగంలో ప్రేయసిగానూ అలరించిన వైనం ఇప్పటికీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనే చెప్పాలి… పైగా వరుసగా మూడు చిత్రాలతో ప్రభాస్, అనుష్క బంపర్ హిట్స్ సాధించడమూ ఈ తరంలో అనితరసాధ్యమనే అనిపిస్తోంది…
‘బాహుబలి’ చిత్రాలతో తనకు లభించిన ‘పాన్ ఇండియా స్టార్’ ఇమేజ్ నిలుపుకోవడానికి ప్రభాస్ తపిస్తున్నారు… అందులో భాగంగానే తనతో ‘మిర్చి’ వంటి హిట్ తీసిన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలోనే ‘సాహో’ వంటి భారీ చిత్రంలో నటించారు ప్రభాస్… ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది… ఏ సెంటిమెంట్ వెంట పడిందో కానీ, ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ప్రభాస్ కు ‘బాహుబలి’ సిరీస్ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి… ‘సాహో’ సరైన రీతిలో సందడి చేయలేక పోయింది… తన పెదనాన్న కృష్ణంరాజుతో కలసి నటించిన చివరి సినిమా ‘రాధే శ్యామ్’ రక్తి కట్టించలేదు…
ప్రభాస్ తొలిసారి నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ సైతం అలరించలేదు… ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రభాస్ సెంటిమెంట్స్ చుట్టూ సినీ ఫ్యాన్స్ చర్చలు మొదలయ్యాయి… నిజానికి వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ ‘ఆదిపురుష్’లోని శ్రీరామ పాత్రలో మీసాలతో కనిపించారు ప్రభాస్… కానీ ప్రజల సెంటిమెంట్స్ దెబ్బ తిన్నాయి… దాంతో మీసాల రామునిగా కనిపించిన ప్రభాస్ కు ‘ఆదిపురుష్’ చేదు రుచి చూపించింది…
చిత్రసీమలో ప్రస్తుతం అనితరసాధ్యమైన రీతిలో ప్రభాస్ ప్రభ వెలుగుతోంది.. అది ఆయన అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేస్తోంది… అయితే ప్రభాస్ వరుస పరాజయాలు ఫ్యాన్స్ ను కాసింత ఆందోళనకు గురి చేశాయి… అయితే తమ హీరో ఎప్పటికైనా మరో బంపర్ హిట్ పట్టేస్తారని అభిమానులు ఆశిస్తూనే ఉన్నారు… వారి ఆశలు ఫలింప చేస్తూ మూడు ఫ్లాపుల తరువాత ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద భలేగా సందడి చేసింది… ‘కేజీఎఫ్’ సిరీస్ తో మంచి పేరు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను వినియోగించుకుంటూ ‘సలార్’ను తెరకెక్కించారు… ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తూ ‘సలార్’ సక్సెస్ రూటులో సాగిపోయింది…
ఇండియా నుండి ఇంటర్నేషనల్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న ప్రభాస్ సినిమాలను అదే స్థాయిలో నిర్మిస్తున్నారు మేకర్స్… అందుకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ వస్తున్నాయి… సినిమాలు బాగోలేక పోయినా, ప్రభాస్ స్టామినాతో వందల కోట్లను అవలీలగా పోగేస్తున్నాయి… టాక్ అదరహో అంటే చాలు వెయ్యి కోట్లూ పట్టేస్తున్నాయి… అదీ ప్రభాస్ స్టామినా!… ‘సలార్’ ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేయగా, తరువాత వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ 1200 కోట్ల రూపాయలు పోగేసింది… ప్రభాస్ పరాజయాలు చూసి నవ్వినవారే, ఆయన చిత్రాల వసూళ్ళ వర్షాలు చూసి జేజేలు కొట్టడం విశేషం!
నిన్న, మొన్నటి దాకా ప్రభాస్ రేంజ్ వేరు… ఇప్పుడు ఆల్ ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్ గానూ ఆయనకు ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది… ‘సలార్-2’, ‘కల్కి-2’తోనూ జనాన్ని పలకరించనున్న ప్రభాస్ అంతకుముందు ‘ద రాజాసాబ్’ గా మురిపించనున్నారు… వీటితో పాటు మంచు విష్ణు ‘కన్నప్ప’లో నంది పాత్రలో కనిపించబోతున్నారు… ఆ సినిమాల కోసం ఇండియాలోనే కాదు, దేశవిదేశాల్లోని సినీ బఫ్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు… మరి ఇంతటి స్థాయిని సొంతం చేసుకున్న మన యంగ్ రెబల్ స్టార్ జీవిత భాగస్వామి అయ్యే అదృష్టవంతురాలు ఎవరా? అన్న ఆసక్తి ప్రభాస్ ను అభిమానించే అందరిలోనూ నెలకొంది… మరి ఆ అదృష్టవంతురాలు ఎవరో వచ్చే ఏడాది ప్రభాస్ బర్త్ డే నాటికి అయినా ఆయన సరసన ఉంటుందని ఆశిద్దాం…
అభిమానుల మదిలో ‘డార్లింగ్’గా నిలచిన యంగ్ రెబల్ స్టార్ నేడు ‘ఇంటర్నేషనల్ స్టార్ ఆఫ్ ఇండియా’గానూ మురిపిస్తున్నారు… ఈ పుట్టినరోజు తరువాత ప్రభాస్ అభిమానులను మరింతగా మురిపిస్తారని ఆశిద్దాం… ఒన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే ప్రభాస్…


