KTR

KTR: బీఆర్‌ఎస్‌లో కవితకు షాక్‌.. కేటీఆర్‌ కీలక నిర్ణయం!

KTR: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ ఇచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలుగా ఉన్న కవితకు చెందిన బాధ్యతలను తగ్గించి, ఆ సంఘానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు.

తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన సింగరేణి కార్మిక సంఘాల సమావేశంలో కేటీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. టీబీజీకేఎస్ కార్యకలాపాలను ఇకపై కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ పార్టీలో, దాని అనుబంధ సంఘాలలో కవిత ప్రాధాన్యత తగ్గుతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

కొద్ది రోజుల క్రితం, తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ ఒకటి లీకై పెద్ద దుమారం రేపింది. ఆ లేఖ లీక్ అవ్వడంపై పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొప్పుల ఈశ్వర్ నియామకం, పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Mahaa News Conclave: గ్రామాల్లో పవనిజం.. పల్లె బాటలో మహాన్యూస్ ..

అదే సమయంలో, తెలంగాణ జాగృతి సంస్థను మరింత పటిష్టం చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. సింగరేణి కార్మిక నాయకులను కలుపుకొని, “సింగరేణి జాగృతి” పేరుతో కమిటీలు కూడా వేశారని జాగృతి శ్రేణులు చెబుతున్నాయి. ఇది టీబీజీకేఎస్ పట్ల పార్టీ తీసుకున్న నిర్ణయానికి ప్రత్యామ్నాయంగా కవిత సొంతంగా కార్మికుల మధ్య తన బలాన్ని నిలుపుకునే ప్రయత్నంగా కూడా చూడవచ్చు.

కొప్పుల ఈశ్వర్ నియామకం సందర్భంగా, ఇకపై టీబీజీకేఎస్ వెంట బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని, దానికి పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, మాజీ మంత్రులు టీబీజీకేఎస్ నాయకులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *