Ponnam Prabhakar: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసన సభలో తొలుత తెలంగాణ చిహ్నంపై జరిగిన చర్చలో సుదీర్ఘంగా మాట్లాడిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు యూపీఏ చైర్ పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీ లేకుంటే తెలంగాణే రాకపోతుండేనని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ సెంటిమెంట్‌కు అనుగుణంగా రాష్ట్ర అధికారిక గీతం లేకుండెనని, తమ ప్రభుత్వం అధికారిక గీతాన్ని ఏర్పాటుచేసిందని తెలిపారు.
Ponnam Prabhakar: తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఎక్కడా అధికారికంగా లేదని, ఉన్న విగ్రహం కూడా ఒక పార్టీకి సంబంధించినది అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అందుకే తమ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రూపొందించి సచివాలయంలో ఇదే రోజు ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
Ponnam Prabhakar: గత పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఎందుకు ఏర్పాటు చేయలేదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఒక వ్యక్తికి, కుటుంబానికి తెలంగాణ తల్లి పరిమితం కాదని, యావత్ రాష్ట్రానికి సంబంధించిన అంశమని చెప్పుకొచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి జిల్లా కేంద్రంలో, కలెక్టరేట్లలో, పోలీస్ కార్యాలయాల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Ponnam Prabhakar: తెలంగాణ తల్లి రాజరికపు పోకడలు లేకుండా ఒకవైపు అభయహస్తం, మరోవైపు పాడిపంటలు, పచ్చదనం అభివృద్ధికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కిరీటాలు లేకుండా, గ్రామ వనితలాగే తెలంగాణ తల్లిని రూపొందించామని చెప్పారు. తెలంగాణ సంస్క్రతి, సంప్రదాయాలు విగ్రహంలో ఉండేలా రూపొందించామని చెప్పారు.
Ponnam Prabhakar: ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రావడానికి అప్పటి కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కమిట్‌మెంట్ వల్లే సాధ్యమైందని చెప్పారు. పక్క రాష్ట్రంలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను ఇచ్చిందన్నారు.