Ponnam Prabhakar: బీజేపీ మరోసారి తన బీసీ వ్యతిరేక వైఖరిని బహిరంగంగా ప్రదర్శించిందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన తన ‘ఎక్స్’ (పూర్వపు ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీసీ నాయకుడిని అడ్డుకున్న బీజేపీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఒక బీసీ నాయకుడు నామినేషన్ దాఖలు చేయబోతుండగా, ఆయనను బలవంతంగా అడ్డుకున్నారని, మద్దతుదారులను భయపెట్టారని మంత్రి ఆరోపించారు. ఇది బీజేపీ లోని నియంతృత్వ ధోరణిని చూపిస్తున్నదని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ముగ్గురు బీసీ ఎంపీలు, అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నా కూడా, బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలన్న మానసికత బీజేపీకి లేదు,’’ అని పేర్కొన్నారు.
రాజా సింగ్ రాజీనామాతో వివాదం చెలరేగింది
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యే రాజా సింగ్ తన అనుచరులతో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, తన అనుచరులను బెదిరించారని, నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ ఘటనపై స్పందించిన పొన్నం, బీజేపీలో అంతర్గతంగా సామాజిక న్యాయానికి ఎంత స్థానం ఉందో మరోసారి వెల్లడైందన్నారు.
సామాజిక న్యాయం సాధ్యమవుతుంది కాంగ్రెస్‌తోనే
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ‘‘మా పార్టీలో ముఖ్యమంత్రి ఓ రెడ్డి అయితే, పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడికి అవకాశం ఇచ్చాం. కుల గణన చేపట్టి, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం చేశాం. ఇది మా నిశ్చయాన్ని చూపిస్తుంది,’’ అని వివరించారు.
బీజేపీ బీసీల గొంతు నొక్కేస్తోందని విమర్శిస్తూ, గతంలో బీసీ నేత బండి సంజయ్‌ను కీలకమైన సమయంలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని గుర్తు చేశారు. ‘‘దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల పక్షాన నిలుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

