Ponglueti: రాష్ట్రంలో రైతాంగానికి మెరుగైన సేవలు అందించడంతో పాటు, భూములకు సంబంధించిన పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
ఈ క్రమంలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఇప్పటికే జీపీవోలు (గ్రామ ప్రజా సేవకులు) అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. తాజాగా, ప్రజలకు భూ సేవలు మరింత సులభంగా అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 19వ తేదీన శిల్పకళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంలో భాగంగా, రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్‌ను జతచేయడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో, సర్వే విభాగం పాత్ర మరింత కీలకమవుతుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 350 మంది సర్వేయర్లు సరిపోరని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రెండో విడతలో మరో 3,000 మందికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించినట్లు వివరించారు.
ఈ నెల 26వ తేదీన జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహించనుండగా, ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీరి సేవలు డిసెంబర్ రెండో వారం నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అని పేర్కొన్నారు.
“రెవెన్యూ శాఖకు సర్వే విభాగం అవినాభావ సంబంధం కలిగి ఉంది. భూముల కొలతలు, రికార్డులు స్పష్టంగా ఉంటేనే వివాదాలు తగ్గుతాయి. సర్వే వ్యవస్థ బలపడితే ప్రజలకు భద్రత, న్యాయం లభిస్తుంది” అని మంత్రి పొంగులేటి తెలిపారు.
గత పది సంవత్సరాలుగా సర్వే విభాగం నిర్లక్ష్యానికి గురైందని, క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు తగిన భూ సేవలు అందలేదని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో జీపీవోలు, ప్రతి మండలంలో లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం ద్వారా ప్రజలకు అవసరమైన భూ సంబంధిత సేవలు వేగంగా, పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.