Pomegranate For Skincare: దానిమ్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు..అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని మీరు నమ్ముతారా? అవును. ఇది తినడానికి మాత్రమే కాకుండా ఫేషియల్ స్క్రబ్‌గా ఉపయోగిస్తే కూడా గొప్ప ప్రయోజనాల అందుతాయి. దానిమ్మపండులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. పండు మాత్రమే కాదు, దాని తొక్క, బెరడు, పువ్వులు మొదలైన అన్ని భాగాలు పోషకాలతో పాటు ఔషధ విలువలను కలిగి ఉంటాయి. సరైన పద్ధతుల్లో వాడితే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఈ పండును ఎలా ఉపయోగించాలి? స్క్రబ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..
సాధారణంగా మీరు ఎంత అందంగా ఉన్నా.. మీ ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే అవి మీ అందాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ముఖాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు దానిమ్మ తొక్కలను ఉపయోగించి ఇంట్లోనే అద్భుతమైన ఫేషియల్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఈ స్క్రబ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల నల్లటి మచ్చలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ స్క్రబ్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. చర్మం తన మెరుపును కోల్పోవడానికి ఈ మృత కణాలే కారణం. అందుకే దానిమ్మ తొక్కను సరిగ్గా వాడితే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుందనడంలో సందేహం లేదు.
Also Read: Pollution: వామ్మో.. ప్రపంచంలోని అత్యంత కాలుష్యనగరాల్లో 13 భారత్ లోనే!
దానిమ్మ తొక్కతో స్క్రబ్ ఎలా తయారు చేయాలి?
మన చర్మ ఆరోగ్యాన్ని, ముఖం యొక్క మెరుపును పెంచడానికి.. ఎండలో దానిమ్మ తొక్కను బాగా ఎండబెట్టి మెత్తని పొడిగా రుబ్బుకోవాలి. ఈ పొడిని తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ చక్కెర, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ అవకాడో నూనెతో బాగా కలపాలి. ఈ మూడు పదార్థాలు కలిపితే మంచి స్క్రబ్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని బాగా కడగాలి. తర్వాత ఈ స్క్రబ్‌ని మీ ముఖం మీద బాగా రుద్దాలి. చేతులతో మసాజ్ చేసి, చర్మానికి సున్నితంగా అప్లై చేయాలి. అలాగే 10-15 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉండటమే కాకుండా కాంతివంతంగా కూడా మారుతుంది.
దానిమ్మ తొక్క స్క్రబ్ ఎందుకు మంచిది?
ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి మంచి ఫలితాలను అందిస్తాయి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, ఇది వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ముడతలను నివారిస్తుంది. ఈ స్క్రబ్ ఉపయోగించిన ప్రతిసారీ చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దానిమ్మతో తయారు చేయబడిన ఈ స్క్రబ్ సహజమైనది కాబట్టి.. దురద, అలెర్జీలు వంటి చర్మ సంబంధిత సమస్యలు ఉండవు.