Hyderabad: వారాసిగూడ పీఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన టు–లెట్ దొంగతనం కేసును పోలీసులు చేధించారు. స్వయనా మేనకోడలే అత్త ఇంట్లో జరిగిన చోరి కేసులో ప్రధాన నిందితురాలని తేలింది. వారాసిగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు.
పార్సిగుట్ట లో పారిజాతం అనే మహిళ ఒంటరిగా అద్దెకు ఉంటుంది. ఆమె ఉంటున్న ఇంట్లో మరో గది ఖాళీగా ఉండటంతో ఇంటిముందు టు లెట్ బోర్డు పెట్టారు. ఈనెల 2న మద్యాహ్నం ఇద్దరు ఆగంతకులు ఇల్లు అద్దెకు కావాలని లోనికి వచ్చి పారిజాతంను కుర్చీలో కట్టేసీ, నోటికి బ్యాండేజీ వేసి కత్తులతో బెదిరించి మూడు తులాల బంగారం నగలు, ఒక మొబైల్ ఫోన్ ను ఎత్తుకెళ్ళారు.
Also Read: Nellore: తల్లిని చిత్రహింసలు పెడుతున్న కసాయి కొడుకు
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా ఎల్ల జ్యోతి,ఎలగరి శ్రీకాంత్,, కొర్రోలు ఈశ్వర్ లు నిందితులుగా తేల్చారు. వీరిని అదుపులోనికి తీసుకొని అరెస్ట్ చేశారు. పారిజాతం మేనకోడలు జ్యోతి తనకు పరిచయం ఉన్న శ్రీకాంత్ కు తన మేనత్త ఒక్కరే ఇంటిలో ఉంటారని,వెళ్ళి బంగారు నగలు చోరి చేయమని స్కెచ్ వేసింది.
జ్యోతి సలహా మేరకు శ్రీకాంత్, తన ఫ్రెండ్ ఈశ్వర్ ను తీసుకొని వెళ్ళి ఈ చోరికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అసలు సూత్రధారి జ్యోతి తో పాటు శ్రీకాంత్, ఈశ్వర్ లను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి చోరి చేసిన 3 తులాల బంగారు నగలు, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో చోరి కేసును చేధించి,చోరి సొత్తును రికవరీ చేసిన ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ రమేశ్ గౌడ్, ఎస్ఐలు, క్రైమ్ కానిస్టేబుల్స్ అభినందించి, రివార్డులను డీసీపీ బాలస్వామి అందచేశారు.