Hyderabad: హీరో విష్వక్సేన్ నివాసంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్, రోడ్ నెంబర్-8లో ఉన్న ఆయన ఇంట్లో మార్చి 16న చోటు చేసుకుంది. ఈ మేరకు విష్వక్సేన్ తండ్రి సి. రాజు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, స్వరాజ్, కార్తీక్, సందీప్ అనే ముగ్గురు నిందితులను గుర్తించి, బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు, డైమండ్ ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.
విష్వక్సేన్ ఇంట్లో మూడవ అంతస్తులో ఆయన సోదరి నివసిస్తున్నారు. మార్చి 16న తెల్లవారుజామున ఆమె మేల్కొని చూసే సరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడిపోయి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆమె తండ్రికి సమాచారం అందించగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీలో దాదాపు ₹2.20 లక్షల విలువైన రెండు బంగారు, డైమండ్ ఉంగరాలు పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, తెల్లవారుజామున ఒక వ్యక్తి బైక్‌పై వచ్చి నేరుగా మూడవ అంతస్తుకు వెళ్లినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

