PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం మంగళవారం ఉదయం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. థింపూలో ఆయనకు భూటాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని మరింత బలపర్చే చర్యలు చేపట్టబోతున్నారు.
భూటాన్ పర్యటనలో ప్రధాని మోదీ పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా 1,020 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు రెండు దేశాల మధ్య విద్యుత్ సహకారానికి కొత్త దశగా భావిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే భూటాన్‌లో విద్యుత్ ఉత్పత్తి పెరగడమే కాకుండా, భారత్‌కు కూడా అవసరమైన పవర్ సరఫరా చేయవచ్చు.
Also Read: Rajnath Singh: ఏ ఒక్కడిని వదిలిపెట్టం.. రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇదే పర్యటనలో మోదీ “గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవం” లో పాల్గొననున్నారు. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ శాంతికి ప్రతీకగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ వేడుకలో మోదీ ప్రత్యేక అతిథిగా పాల్గొని భారతదేశం తరఫున సందేశం ఇవ్వనున్నారు.
ప్రధాని మోదీ ఈ పర్యటనలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్‌చుక్, ప్రధానమంత్రి దశోట్ శేరింగ్‌లతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరపనున్నారు. రక్షణ, విద్య, పర్యావరణం, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచే అంశాలపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
భూటాన్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోదీ తిరిగి భారతదేశానికి చేరుకోనున్నారు. ఈ రెండు రోజుల పర్యటన భారత్–భూటాన్ మధ్య దౌత్య సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

