PM Modi: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చే వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు ఒక ప్రత్యేక లేఖ రాశారు. ఈ లేఖలో సునీతా విజయంపై ప్రశంసలు కురిపించిన మోదీ, ఆమె భద్రంగా భూమికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఆమె భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు.
సుమారు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్, విల్మోర్‌తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్చి 1న ఈ లేఖను రాసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా సునీతా ఆరోగ్యంపై ఆరా తీశారని, భారతీయుల మనోగతాన్ని తన లేఖ ద్వారా వ్యక్తీకరించారని తెలిపారు.
Also Read: Pawan Kalyan-Botsa: ఏపీ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ – బొత్స మధ్య ఆసక్తికర సంభాషణ
PM Modi: సునీతా భూమికి చేరుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఆమె సురక్షితంగా తిరిగి రావాలని 140 కోట్ల మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారని ప్రధాని లేఖలో పేర్కొన్నారు. వ్యోమగామి మైక్ మాసిమినో ద్వారా ఈ లేఖను పంపిన మోదీ, సునీతా మిషన్ విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. ఆమె భారతదేశానికి గర్వకారణమని ప్రశంసిస్తూ, ఎప్పుడైనా భారత పర్యటనకు రావాలని ఆహ్వానించారు.
అంతేకాకుండా, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లతో సమావేశాల్లోనూ సునీతా ఆరోగ్యంపై చర్చించానని ప్రధాని లేఖలో తెలిపారు. ఆమె చేసిన విశేష కృషికి ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, భారతీయులు మాత్రం ఆమె భద్రంగా స్వదేశం చేరుకోవాలని ప్రార్థిస్తున్నారని మోదీ వెల్లడించారు.