PM Modi

PM Modi: బీహార్ మహిళలకు మోదీ దసరా శుభవార్త: ఖాతాల్లో రూ.10 వేలు జమ!

PM Modi: బిహార్‌లో మహిళల ఆర్థిక బలోపేతానికి ఎన్‌డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పేరుతో ప్రారంభమైన ఈ పథకంలో 75 లక్షల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున నగదు జమ అయింది. మొత్తం రూ.7,500 కోట్లతో అమలవుతున్న ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (సెప్టెంబర్ 26, 2025) ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఢిల్లీ నుంచి మోడీ, పాట్నా నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా ఇతర మంత్రులు పాల్గొన్నారు. ఈ పథకం మహిళల స్వయం ఉపాధి, సాధికారత పెంచడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆగస్టు 29, 2025న ఈ పథకానికి ఆమోదం తెలిపారు. దీని ప్రధాన లక్ష్యం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా వారి ఆర్థిక స్వావలంబనను పెంచడం. ఈ మొత్తంతో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకు తప్పనిసరిగా ఈ లబ్ధి అందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ పథకం పవిత్ర నవరాత్రి పండుగ సమయంలో ప్రారంభించడం మహిళల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని అన్నారు. “మన ఆడబిడ్డలు ఇప్పుడు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. బీహార్ మహిళల ఆశీస్సులు మాకు ఎంతో బలం” అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: jubliee hills By elections 2025: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన కేసీఆర్‌

మోడీ తన ప్రసంగంలో గత ఆర్‌జేడీ పాలనను (లాంతరు పాలన) గుర్తు చేస్తూ విమర్శించారు. అప్పుడు మహిళలు అవినీతితో ఎన్నో కష్టాలు పడ్డారని, ఢిల్లీ నుంచి పంపిన డబ్బుల్లో కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరేదని ఆరోపించారు. ఇప్పుడు పీఎం జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా రూ.10,000 ఖాతాల్లో పడుతున్నాయని, ఇది మహిళల సేవ, సమృద్ధి, స్వాభిమానానికి దోహదపడుతుందని హైలైట్ చేశారు.

ఈ పథకం త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి కీలక అంశంగా మారనుంది. అయితే, ఇండియా కూటమి నేతలు ఈ పథకాన్ని విమర్శిస్తున్నారు. ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, బీహార్ మహిళలు తెలివైనవారని, ఈ పథకాలు కేవలం ఎన్నికల జిమ్మిక్కులు మాత్రమేనని ఎద్దేవా చేశారు.

లబ్ధిదారులు తమ స్థితిని udyami.bihar.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ చర్య బీహార్ మహిళల భవిష్యత్తుకు మలుపు తిరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *