PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సమాధానం ఇచ్చారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోందని మోదీ స్పష్టం చేశారు. వారణాసిలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ విధించిన సుంకాలు, రష్యాతో భారత్ సంబంధాలపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ట్రంప్ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొందని, అన్ని దేశాలు తమ సొంత ప్రయోజనాలపైనే దృష్టి సారిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. “భారత్ అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారనుంది. అందువల్ల, ఇప్పుడు మన ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది,” అని ఆయన నొక్కి చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశానికి మంచి జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే, తమ విభేదాలను పక్కన పెట్టి ‘స్వదేశీ’ ఉత్పత్తుల విప్లవానికి మద్దతు ఇవ్వాలని, భారతీయులు తయారుచేసిన వస్తువులనే కొనుగోలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు మనం గొంతు కలపాలని ఆయన అన్నారు.
జూలై 31న, భారత ఉత్పత్తులపై ట్రంప్ 25 శాతం సుంకాలు విధించిన ఒక రోజు తర్వాత, భారత్-రష్యా బంధంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇద్దరూ తమ ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకుంటున్నారని, కలిసి మునిగిపోతారని ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Bandi Sanjay: బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదంపై తీవ్ర హెచ్చరికలు, ప్రతిపక్షాలపై మండిపాటు:
అదే సమావేశంలో ప్రధాని మోదీ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కళ్లముందు అన్యాయం, ఉన్మాదం జరుగుతుంటే ఆ మహాదేవుడు తన రుద్ర రూపాన్ని చూపిస్తాడు. ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో భారత్ సత్తాను ప్రపంచం మొత్తం చూసింది. మనతో పెట్టుకుంటే పాతాళలోకంలో ఉన్నా వదిలిపెట్టబోమని రుజువు చేశాం,” అని ఆయన హెచ్చరించారు.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైతే కాంగ్రెస్, దాని మిత్ర పార్టీలు బాధపడుతున్నాయని, వారికి ఆ విజయం మింగుడుపడటం లేదని మోదీ దుయ్యబట్టారు. అందుకే మన భద్రతా దళాలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు కూడా వారికి సమస్యగా మారిందని, ‘సింధూర్’ను తమాషా అనడం సిగ్గుచేటని ప్రధాని మండిపడ్డారు. పాకిస్తాన్ బాధను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ భరించలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులను మట్టుబెట్టిన ‘ఆపరేషన్ మహాదేవ్’ గురించి కూడా మోదీ ప్రస్తావించారు. “ఆ మహాదేవుడి ఆశీస్సులతోనే పహల్గాంకు ప్రతీకారం తీర్చుకోగలిగాం. ఉగ్రవాదులు దొరికినప్పుడు చంపకుండా వారాలు చూసుకోవాలా? లేదంటే వారు పారిపోయేందుకు అవకాశం ఇవ్వాలా?” అని ప్రశ్నిస్తూ, ఆపరేషన్ జరిగిన సమయాన్ని అనుమానించేవారిని మోదీ దుయ్యబట్టారు.