Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. మారిషస్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ 1968 మార్చి 12న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రం పొందింది. ఇది 1992లో కామన్వెల్త్ కింద గణతంత్ర రాజ్యంగా మారింది. భారత సంతతికి చెందిన సర్ సీవూసాగర్ రాంగులాం నాయకత్వంలో మారిషస్ స్వాతంత్య్రం పొందింది. మారిషస్ ఈ రోజును జాతీయ దినోత్సవంగా జరుపుకుంటుంది.
ఈ ఏడాది వేడుకలో భారత సైన్యం, నావికా యుద్ధనౌక, వైమానిక దళానికి చెందిన ఆకాశ్ గంగా స్కై డైవింగ్ బృందం కూడా పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ లభించింది . ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడుగా మోదీ నిలిచారు. ఇది ప్రధానమంత్రి మోదీకి బయట దేశాల నుంచి అందిన 21వ అంతర్జాతీయ అవార్డు.
భారతదేశం -మారిషస్ 8 ఒప్పందాలు
ఈ సందర్భంగా భారత, మారిషస్ ప్రధానమంత్రుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని కూడా సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా, మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులం మాట్లాడుతూ, మన 57వ స్వాతంత్ర్య వార్షికోత్సవ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని మనల్ని గౌరవించారని అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న మంచి సంబంధాలకు నిదర్శనం అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Cruelty: గర్భిణీ ఆవు హత్య.. నిందితులను పట్టిచ్చిన గూగుల్ పే
1.4 బిలియన్ల భారతీయుల తరపున, మారిషస్ ప్రజలకు వారి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మారిషస్ జాతీయ దినోత్సవం నాడు మరోసారి ఇక్కడికి వచ్చే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. భారతదేశం- మారిషస్ లు హిందూ మహాసముద్రం ద్వారానే కాకుండా ఉమ్మడి సంస్కృతి, విలువలతో కూడా అనుసంధానించచి ఉన్నాయి అంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారతదేశం-మారిషస్ భాగస్వామ్యానికి ‘మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం’ హోదా ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మారిషస్‌కు కొత్త పార్లమెంట్ భవనం నిర్మించడంలో భారతదేశం సహాయం చేస్తుందన్నారు. దీనిని ‘ప్రజాస్వామ్య తల్లి’ అయిన భారతదేశం మారిషస్‌కు ఇచ్చిన బహుమతిగా ప్రధాని మోదీ అభివర్ణించారు.