Shravana Rao Arrested: తెలంగాణలో ఇటీవల పెద్ద దుమారాన్ని సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు, మరో చీటింగ్ కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అఖండ ఇన్‌ఫ్రాటెక్ అనే ప్రైవేట్ కంపెనీకి రూ.7.8 కోట్ల మోసం చేసిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది.
ఇనుప ఖనిజం పేరుతో మోసం
శ్రవణ్ రావు బెంగళూరులోని తన కంపెనీ ఇన్‌రిథ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున 2022లో అఖండ సంస్థ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణను కలిశారు. ఆయనకు సండూరులోని ఎకోర్ ఇండస్ట్రీస్ తన ఆధీనంలో ఉందని చెప్పి, ఆ కంపెనీ నుంచి ఇనుప ఖనిజాన్ని కొనుగోలు చేస్తే టన్నుకు రూ.300 లాభం వస్తుందని నమ్మబలికారు. శ్రవణ్ మాటలపై నమ్మకం వచ్చిన అఖండ సంస్థ, విడతలవారీగా రూ.7.8 కోట్లు చెల్లించింది.
ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లపై హరీశ్‌రావు అబద్ధాలు మానుకోవాలి
ఆ డబ్బును తన ఖాతాలకు మళ్లించుకున్న శ్రవణ్, చివరకు వాస్తవ సరుకు సరఫరా చేయకుండానే ఆరుబయటపడ్డాడు. బాధితులు తరువాత అన్వేషణ ప్రారంభించగా, ఇందులో శ్రవణ్‌తో పాటు ఎకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఉమా మహేశ్వర్ రెడ్డి, శ్రవణ్ అనుచరుడు వేదమూర్తి కూడా పాత్ర పోషించినట్టు తేలింది.
శ్రవణ్ భార్య స్వాతిరావు కూడా నిందితురాలిగా
దీంతో బాధితులు శ్రవణ్‌ను కలవడానికి ప్రయత్నించగా, అతను అప్పటికే విదేశాలకు పారిపోయినట్టు తెలుస్తోంది. కంపెనీ బాధ్యతలు స్వాతిరావు చూసేస్తున్నారని చెబుతుండడంతో బాధితులు ఆమెను కలిశారు. ఆమె తొలుత రూ.50 లక్షలు తిరిగి చెల్లించి మిగతా డబ్బులు త్వరలో చెల్లిస్తానని హామీ ఇచ్చినా, తరువాత ఆమె కూడా అందుబాటులో లేకపోయింది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ 24న సీసీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్యాపింగ్ కేసుతో సంబంధం – బెయిల్ కూడా ప్రమాదంలో
ఇది ఒక్కటే కాదు – శ్రవణ్ రావు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఫోన్ల ట్యాపింగ్‌కు ఆయన ప్రమేయం ఉన్నట్టు సిట్ గుర్తించి కేసు నమోదు చేసింది. అయితే, అప్పట్లో ఆయన విదేశాలకు పారిపోయారు. ఇటీవలే సుప్రీం కోర్టు ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌తో తిరిగి వచ్చారు.
అయితే సిట్ విచారణకు ఆయన పూర్తిగా సహకరించడం లేదన్న కారణంగా, మే 5న ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ సుప్రీంకోర్టును కోరింది. ఇదిలా ఉండగా, ఇప్పుడు చీటింగ్ కేసులో కూడా ఆయన అరెస్ట్ కావడం అతని పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది.

