Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌ను మంగళవారం రాత్రి సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం ఆ దేశ ప్రజలకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు 72 మంది ప్రాణాలు కోల్పోగా, 294 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
బోగో నగరంలో అత్యధిక ప్రాణ నష్టం
సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. ఈ నగరంలోనే ఎక్కువ మంది మరణించినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లపై రాళ్లు, మట్టి కూలిపడి ప్రాణ నష్టం జరిగింది.
మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం
భూకంపం కారణంగా అనేక ఇళ్లు, రహదారులు, వంతెనలు, విద్యుత్ లైన్లు ధ్వంసమయ్యాయి. 100 ఏళ్లకు పైబడిన పురాతన చర్చిలు, భవనాలు కూడా పాక్షికంగా కూలిపోయాయి. మొదట అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేసినా, తర్వాత అవి ఉపసంహరించుకున్నారు.
ఇది కూడా చదవండి: Indrakeeladri: రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ దర్శనం.. బారులు తీరిన భక్తులు.. తెప్పోత్సవం రద్దు..
2013 తర్వాతి అత్యంత ఘోర భూకంపం
స్థానిక అధికారులు ఈ ఘటనను 2013లో బోహోల్ ద్వీపంలో సంభవించిన 7.2 తీవ్రత గల భూకంపం తర్వాత దేశంలో చోటుచేసుకున్న అత్యంత ఘోర ప్రకృతి విపత్తుగా పేర్కొన్నారు. 2013 భూకంపంలో 222 మంది మృతి చెందగా, ఇప్పుడు 72 మంది ప్రాణాలు కోల్పోవడం ఆ దేశ చరిత్రలో మరోసారి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.
భూకంపాలకు కేంద్ర బిందువైన ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ “పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్” ప్రాంతంలో ఉన్నందున, ఏటా సగటున 800కిపైగా భూకంపాలు నమోదవుతుంటాయి. అందువల్ల భూకంపాలకు అత్యంత ప్రమాదకర ప్రాంతంగా ఈ దేశం పేరుపొందింది.