Perni Nani: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్ని నాని మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ మరియు కామినేని శ్రీనివాస్ చేసిన విమర్శలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినందుకు నాని తీవ్రంగా మండిపడ్డారు.
కామినేనిపై విమర్శల జడివాన
కైకలూరు ఎమ్మెల్యే అయిన కామినేని శ్రీనివాస్ను ఉద్దేశించి పేర్ని నాని మాట్లాడుతూ.. “కైకలూరు ప్రజల కష్టాలు కామినేనికి పట్టవు. ప్రజలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నా ఆయనకు పట్టింపు లేదు. దళితులపై జనసేన నేతలు కత్తులతో దాడి చేసినా మాట్లాడలేదు. ప్రజల కష్టాల గురించి మాట్లాడటం చేతకానివాడు అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు” అంటూ దుయ్యబట్టారు.
“80 ఏళ్లు దాటినా కామినేనికి ఇంగితజ్ఞానం లేదు. ఈ వయసులో అబద్ధాలు మాట్లాడటం భావ్యమేనా? అర్జెంట్‌గా మంత్రి అయిపోవాలని ఆయన ఆరాటం” అంటూ మండిపడ్డారు.
పవన్ కల్యాణ్.. బాలకృష్ణపై ఎద్దేవా
పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా హెలీకాప్టర్లలో తిరుగుతుంటే బాలకృష్ణ చూడలేకపోతున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. “తన బావతో సమానంగా పవన్ జామర్ కార్లలో తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. పవన్‌కు చంద్రబాబు ఒంగి ఒంగి సలామ్ కొడుతుంటే బాలకృష్ణ కుతకుతలాడిపోతున్నాడు” అని విమర్శించారు.
బాలకృష్ణ గురించి మాట్లాడుతూ.. “బాలకృష్ణ వల్ల అసెంబ్లీ గేటు దగ్గర కూడా బ్రీత్ ఎనలైజర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బాలకృష్ణ తాగి కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. అసలు సైకో బాలకృష్ణ… పవన్ కల్యాణ్‌ను చూసి తట్టుకోలేని సైకో బాలకృష్ణ” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పురాణాలు, వేదాలు బట్టీ పడితే సరిపోదు అని సెటైర్లు వేశారు.
ప్రమాణం చేయగలవా?
బాలకృష్ణకు ఒక సవాల్ విసిరారు పేర్ని నాని. “బాలకృష్ణ స్వయంగా నాతో ఫోన్ లో మాట్లాడాడు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా. దమ్ముంటే నువ్వు నీ తల్లిదండ్రులపై ప్రమాణం చెయ్యి బాలకృష్ణ” అని అన్నారు.
నందమూరి తారకరామారావు, బసవతారకం వంటి గొప్ప వ్యక్తుల కడుపున పుట్టి ఇంతలా దిగజారిపోవడం సిగ్గుచేటన్నారు. ‘అఖండ’ సినిమా కోసం బాలకృష్ణ తనకు ఫోన్ చేసి జగన్ మోహన్ రెడ్డితో అపాయింట్ మెంట్ ఇప్పించమని అడిగారని, ఆ విషయం జగన్‌కు చెప్పి ఆయన ఏ సాయం అడిగితే అది చేయమని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్ అని పేర్ని నాని గుర్తుచేశారు.
చేసిన సాయం మర్చిపోయావా?
వైఎస్సార్ చేసిన సాయాన్ని బాలకృష్ణ మర్చిపోయాడా అని నాని ప్రశ్నించారు. “యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకున్న విషయం గుర్తు లేదా? మనిషి జన్మ ఎత్తినవాడెవడైనా చేసిన సాయం మర్చిపోతాడా?” అని నిలదీశారు.
“జగన్ మోహన్ రెడ్డిని కలవడం ఇష్టం లేకపోతే రావడం మానేయండి. అంతేకానీ ఎందుకు ఈ సైకో మాటలు? మీ బసవతారకం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ బిల్లులు చేయించుకోలేదా?” అని ప్రశ్నించారు.
చిరంజీవి స్పందనపై హర్షం
చిరంజీవిని సొంత అన్నలా భావించి జగన్ మోహన్ రెడ్డి గౌరవించారని పేర్ని నాని అన్నారు. “మూడు, నాలుగేళ్ల నుంచి ఎన్నో అవమానాలను భరించాం. చిరంజీవి వెంటనే స్పందించినందుకు సంతోషం” అన్నారు.
సినిమా పరిశ్రమ గురించి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ఆలోచించారని నాని పేర్కొన్నారు. “అధిక ధరలు పెంచుకుంటూ పోతే పరిశ్రమ దెబ్బతింటుందని జగన్ ఆనాడే చెప్పారు. సినిమా ధియేటర్లు మూతపడి కళ్యాణ మండపాలుగా మారిపోతాయి” అని హెచ్చరించారు.
సినీ పరిశ్రమ మనుగడను కాపాడాలని జగన్ కోరారని, ఆయన ఆలోచనను గౌరవించి చిరంజీవి, రామ్ చరణ్ వైజాగ్ లో స్థలం కొన్నారని తెలిపారు. చంద్రబాబు ఏనాడైనా పరిశ్రమకు మేలు చేశాడా? ఆయన కేవలం తన ఈవెంట్లకు, అడ్వరటైజ్ మెంట్లకు మాత్రమే వాడుకున్నాడని విమర్శించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ చిరంజీవి పెద్ద మనసుతో స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు పేర్ని నాని.