Pawan Kalyan: సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. అందిన సమాచారం ప్రకారం, స్కూల్‌లో ప్రమాదం జరిగిన సమయంలో మార్క్ శంకర్ అక్కడే ఉండగా, ఆయన చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే, పొగ ఎక్కువగా ముట్టడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడినట్లు తెలుస్తోంది. వెంటనే స్కూల్ సిబ్బంది అప్రమత్తమై అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్ తక్షణమే సింగపూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవితల్లి బాటలో భాగంగా పర్యటనలో ఉన్నారని తెలిపారు. కురిడి గ్రామంలో ఆలయ దర్శనం, స్థానికులతో సమావేశం వంటి కార్యక్రమాల తరువాతే సింగపూర్‌కు బయలుదేరనున్నట్లు స్పష్టం చేశారు.
మరోవైపు, బుధవారం సాయంత్రం విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన పవన్ కల్యాణ్, కుమారుడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పర్యటన ముగిసిన వెంటనే సింగపూర్ వెళ్లనున్నారు.