Pawan Kalyan: ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని పెరవలిలో పర్యటించనున్నారు. భారీ వ్యయంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం పెరవలిలోని ఎన్‌హెచ్ 216-ఏ రహదారి సమీపంలో ఆర్‌కే రైస్ మిల్ దగ్గర జరగనుంది.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రూ.3,050 కోట్లతో ఈ బృహత్తర వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టింది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ పరిసర ప్రాంతాలైన ధవళేశ్వరం, బొబ్బర్లంక, వేమగిరి వద్ద నుంచి గోదావరి జలాలను సేకరించి, అత్యాధునిక సాంకేతిక విధానాలతో శుద్ధి చేసి ఇంటింటికీ త్రాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని 23 నియోజకవర్గాలు, 66 మండలాల్లో నివసిస్తున్న సుమారు 67.82 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుంది.
ప్రాజెక్ట్ వ్యయంలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రూ.1,650 కోట్లు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు రూ.1,400 కోట్లు కేటాయించారు. దీని ద్వారా కాకినాడ, డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాలు, 32 మండలాల్లో నివసిస్తున్న 39.64 లక్షల మందికి, అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని 12 నియోజకవర్గాలు, 34 మండలాల్లోని 28.18 లక్షల మందికి త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
జల్ జీవన్ మిషన్ నిధులతో రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రెండేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాలు ఉప్పునీరు కలగడం, కాలుష్యం పెరగడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ అమలుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నీటిని శుద్ధి చేసి, గ్రావిటీ విధానంలో పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికీ త్రాగునీరు సరఫరా చేయనున్నట్లు నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నది ప్రవహిస్తున్నా ఇప్పటివరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు త్రాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి ప్రజల జీవితాల్లో ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

