Pawan Kalyan:జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన దేశభక్తి స్ఫూర్తిని చాటారు. పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో సైనికుల కుటుంబాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ‘ఆపరేషన్ సిందూర’ పేరిట చేస్తోన్న భారత ధర్మ యుద్ధంకు మద్దతుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తున్నారు. ధర్మం, దేశం, సైనికులంటే ఉప్పొంగే పవన్, తన నిర్ణయాలతో హృదయాలను గెలుచుకుంటున్నారు.
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… ఒక్క పేరు చాలు దేశభక్తి ఉప్పొంగేలా చేయడానికి. ఆయన తీసుకునే నిర్ణయాలు కేవలం రాజకీయాలకే పరిమితం కావని చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ. దేశ సైనికుల పట్ల, వారి కుటుంబాల పట్ల గౌరవాన్ని, ఆదరణను చాటుతూ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ రెండు నిర్ణయాలను ప్రకటించారు. పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో, భారత సైన్యంలో పనిచేస్తున్న ఏపీ సైనికుల కుటుంబాలకు స్థిరాస్తి పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇస్తూ పవన్ తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం. ఈ నిర్ణయం కేవలం ప్రకటనలోనే ఆగలేదు, శుక్రవారమే జీవో ఎంఎస్ నెం: 49 ద్వారా అమలులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనికులు, రిటైర్డ్ సైనికులు, సైనిక వితంతు కుటుంబాలకు ఈ సౌలభ్యం వర్తిస్తుంది. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి రక్షణ కవచంలా నిలిచే జవాన్లకు నిజమైన నీరాజనమిది.
అంతటితో ఆగని పవన్, పాకిస్తాన్‌పై భారత బలగాలు చేస్తున్న ధర్మ యుద్ధంకు నైతిక మద్దతు ప్రకటించారు. సైనికులకు, ప్రధాని నరేంద్ర మోదీకి దైవ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ, తిరుత్తణి, తిరుచెందూరు వంటి షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మోపిదేవి, బిక్కవోలు, ఇంద్రకీలాద్రి, పిఠాపురం ఆలయాలతో పాటు, శ్రీకాకుళంలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైనికుల కోసం పూజలు జరిపిస్తున్నారు. యుద్ధ ప్రభావిత రాష్ట్రాల ప్రజల క్షేమం కోసం కూడా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. క్రైస్తవ, ఇస్లాం సమాజాలను కూడా చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు చేయమని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Eatala Rajendar: సీఎం రేవంత్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ ఒక నాయకుడిగా మాత్రమే కాదు, దేశభక్తి జీవనదిగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ కార్యాలు సైనికులకు ఆర్థిక, ఆధ్యాత్మిక బలాన్ని అందిస్తూ, దేశ ప్రజల హృదయాల్లో గౌరవాన్ని పెంచుతున్నాయి. ధర్మం, దేశం, సైనికులు అనగానే ఉప్పొంగే పవన్, తన నిర్ణయాలతో ఆ ఉద్వేగానికి కార్యరూపం ఇస్తున్నారు. దేశ రక్షకుల పట్ల పవన్ చూపిస్తున్న అచంచలమైన భక్తి, గౌరవానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు.