Pawan Kalyan: కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఈ సమస్యలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రత్యేక హై లెవల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీలో పరిశ్రమల శాఖ, మత్స్యశాఖ కమిషనర్లు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ, కాకినాడ జిల్లా కలెక్టర్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. అలాగే, స్థానిక పరిస్థితులను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు మత్స్యకార వర్గాల తరఫున జిల్లా కలెక్టర్ నామినేట్ చేసే ప్రతినిధులు కూడా ఇందులో భాగమవుతారు. ఈ కమిటీ ప్రధానంగా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న పర్యావరణ, జీవనోపాధి, ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం లక్ష్యంగా పనిచేయనుంది.
ఇటీవలి కాలంలో ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. సముద్రంలో ఫార్మా కంపెనీల వ్యర్థాలు కలవడం వలన మత్స్య సంపద దెబ్బతింటోందని, కాలుష్య కారక పరిశ్రమలను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నేరుగా జోక్యం చేసుకుని మత్స్యకార సంఘాల ప్రతినిధులతో చర్చించారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన అనంతరం, ఇప్పుడు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చింది.
ఇది కూడా చదవండి: Karur Stampede: ఇప్పుడు రాలేకపోతున్నాను.. త్వరలోనే కలుస్తా.. బాధితులకు విజయ్ ఫోన్‌కాల్
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ, “మత్స్యకారుల సమస్యలపై నేను చేసిన సూచనలకు తక్షణమే స్పందించి కమిటీ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు గారికి, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నిర్ణయంతో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను” అని తెలిపారు.
ప్రస్తుతం ఈ కమిటీ వచ్చే రోజుల్లో ఉప్పాడ ప్రాంతాన్ని సందర్శించి, మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి నివేదికను సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ నిర్ణయంతో ఉప్పాడ తీర ప్రాంత ప్రజల్లో, ముఖ్యంగా మత్స్యకార వర్గాల్లో సంతోషం నెలకొంది.