Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆధునిక హంగులను వదిలిపెట్టి, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరిస్తూ అభివృద్ధి చెందిన కూర్మ గ్రామం ఇలా అగ్నికి ఆహుతి కావడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు సమగ్రంగా, అన్ని కోణాల్లో విచారణ చేయాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, నిజాన్ని వెలికితీయడానికి లోతైన దర్యాప్తు అవసరమన్నారు.
గ్రామస్థుల పరిస్థితిని తెలుసుకోవడానికి జిల్లా అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. వారికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ప్రకృతి సమ్మేళనంలో మట్టి ఇళ్లలో నివసిస్తూ, యాంత్రిక జీవన విధానాలకు దూరంగా ఉన్న కూర్మ గ్రామ ప్రజలు ధార్మికతకు అధిక ప్రాధాన్యతనిస్తూ జీవిస్తున్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఈ గ్రామంలో వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడగలగడం విశేషం. ఇటువంటి విలువలతో కూడిన గ్రామంపై ఏర్పడిన అగ్నిప్రమాదం వెనుక అసలు కారణం ఏంటో త్వరలో వెలుగులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.