Viral Video: పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ అనేక ప్రాంతాలను వరద ముంచెత్తుతున్నాయి. రావల్పిండిలోని చాహన్ ఆనకట్ట సమీపంలో అయితే పరిస్థితి మరింత విషమంగా మారింది.
వరదలో లైవ్ రిపోర్ట్ ఇస్తున్న జర్నలిస్టు
ఓ జర్నలిస్టు అక్కడి వరద పరిస్థితులను లైవ్‌లో వివరిస్తున్నాడు. చేతిలో మైక్ పట్టుకుని, మెడ లోతు నీటిలో నిలబడి వరద తీవ్రతను వివరించడం మొదలెట్టాడు. కానీ ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగి, అతను వరదలో కొట్టుకుపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. కొందరు అతని ధైర్యసాహసాలను ప్రశంసిస్తుండగా, మరికొందరు “రేటింగ్ కోసం ప్రాణాలు పణంగా పెట్టడం అవసరమా?” అంటూ విమర్శిస్తున్నారు.
పాకిస్తాన్లో వరద బీభత్సం
జూన్ 26 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్ వ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు 116 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
-
పంజాబ్ ప్రావిన్స్‌లో 44 మంది
-
ఖైబర్ పఖ్తుంఖ్వాలో 37 మంది
-
సింధ్‌లో 18 మంది
-
బలూచిస్తాన్‌లో 19 మంది
-
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 1 వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.
చాహన్ ఆనకట్ట కూలిపోవడం పరిస్థితిని మరింత విషమం చేసింది
చాహన్ ఆనకట్ట కూలిపోవడంతో రావల్పిండితో పాటు పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్, తాగునీరు వంటి ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగింది.
జర్నలిస్టు ధైర్యమా? లేక నిర్లక్ష్యమా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు “ఇది నిజమైన జర్నలిజం” అని ప్రశంసిస్తుంటే, మరికొందరు “ఇది ధైర్యం కాదు, ప్రాణాలకు ముప్పు తెచ్చే నిర్లక్ష్యం” అని విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాయి.
A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer
— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025

