Ishaq Dar: పాకిస్తాన్ భద్రతా సంక్షోభం, ముఖ్యంగా అఫ్గాన్ తాలిబాన్ సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న ఉగ్రవాద సమస్యకు పరోక్షంగా మాజీ ఐఎస్‌ఐ (ISI) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఫైజ్ హమీద్ మరియు గతంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన ఆరోపించారు. 2021లో తాలిబాన్ అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న కొద్ది వారాల తర్వాత, అప్పటి ఐఎస్‌ఐ చీఫ్ ఫైజ్ హమీద్ కాబూల్‌లోని సెరెనా హోటల్‌లో టీ తాగుతూ మీడియాకు కనిపించారు. “అంతా బాగానే ఉంటుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఇషాక్ దార్, “ఆ ఒక్క కప్పు టీ మా దేశానికి అత్యంత ఖరీదైనదిగా మారింది” అని వ్యాఖ్యానించారు.
Also Read: DGP Shivdhar Reddy: మహిళా డీఎస్పీలు మరో తరానికి ఆదర్శం కావాలి
గత ప్రభుత్వం (ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం) “ఆ కప్పు టీ” సాకుతో అఫ్గానిస్తాన్‌కు తమ సరిహద్దులను తెరిచివేసిందని దార్ ఆరోపించారు. ఈ చర్య కారణంగా, అంతకుముందు పాకిస్తాన్ నుండి పారిపోయిన 35,000 నుండి 40,000 మంది తాలిబాన్ (TTP వంటి ఉగ్రవాద గ్రూపుల సభ్యులు) దేశంలోకి తిరిగి ప్రవేశించారని దార్ వివరించారు. అంతేకాకుండా, అప్పటి ప్రభుత్వం స్వాత్ ప్రాంతంలో పాకిస్తాన్ జెండాలను తగులబెట్టిన, ఎంతో మందిని చంపిన అత్యంత ప్రమాదకరమైన నేరగాళ్లను కూడా జైళ్ల నుంచి విడుదల చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ఒక పెద్ద పొరపాటు. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా మనం మనల్ని నియంత్రించుకోవాలని దార్ సెనేట్ సమావేశంలో అన్నారు. ఇషాక్ దార్ చేసిన ఈ వ్యాఖ్యలు, అఫ్గాన్ తాలిబాన్‌పై పాకిస్తాన్ గతంలో అనుసరించిన విధానాలు ఎంతగా తిరిగి తమకే దెబ్బ కొట్టాయి అనే విషయాన్ని అంగీకరించినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ సరిహద్దుల వెంబడి భద్రతా ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

