IndiGo Flight: ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం తీవ్ర వాతావరణ పరిస్థితులలో చిక్కుకుంది. ప్రయాణంలో ఓ దశలో విమానాన్ని ఆపి భద్రంగా దించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ దానికి అవసరమైన మార్గం పాకిస్థాన్ గగనతలంగా ఉండటంతో, అక్కడి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను ఇండిగో పైలట్లు సాయం కోరారు. విమానంలో ఉన్న 227 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. అయినా పాకిస్థాన్ అధికారులు కనికరం చూపలేదు.
ఈ సంఘటన బుధవారం జరిగింది. ఇండిగో 6E 2142 విమానం ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం అమృత్‌సర్ ప్రాంతంలోకి వచ్చేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన తలెత్తింది. విమానం కుదిపివేయబడటంతో పైలట్లు దాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. కానీ దానికి సమీప మార్గం పాక్ గగనతలంగా ఉండటంతో లాహోర్ ATCని సంప్రదించారు.
IndiGo Flight: ఇండిగో అధికారులు లాహోర్ ATCకి స్పష్టంగా తెలియజేశారు – గగనతలంలో ప్రవేశించేందుకు అనుమతిస్తేనే 227 మంది ప్రాణాలు బతికే అవకాశం ఉంది అని. కానీ పాకిస్థాన్ అధికారులు ఈ విజ్ఞప్తిని తిరస్కరించారు. భారత్-పాక్ మధ్య సాగుతున్న విమాన నిషేధం (ఎయిర్‌స్పేస్ బ్యాన్) కారణంగా వారు ‘నోట్‌మ్’ (NOTAM) ఆధారంగా గగనతల ప్రవేశానికి అనుమతి ఇవ్వలేమని చెప్పారు.
ఈ విమానంలో సాధారణ ప్రయాణికులతో పాటు ఐదుగురు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు కూడా ఉన్నారు. వాతావరణం తీవ్రమవడం వల్ల విమానం ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తులోంచి వేగంగా కిందకు పడిపోయింది. ప్రయాణికులు భయంతో అరవడం ప్రారంభించారు. కాక్‌పిట్‌లో చాలా అలర్ట్‌లు వచ్చినా, పైలట్లు విమానాన్ని శాంతంగా ముందుకు నడిపారు.
Also Read: Virat Kohli: అరుదైన్ రికార్డుకు దగ్గరలో కోహ్లీ..
తీవ్ర తుఫాను కారణంగా విమానం ముందు భాగం (నోస్ రాడోమ్) దెబ్బతింది. ఇది వాతావరణ రాడార్‌ను కలిగి ఉంటుంది. కొన్ని పరికరాలు పని చేయకపోయినా, పైలట్లు సాహసంగా వ్యవహరించి విమానాన్ని శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులెవరూ గాయపడలేదు.
IndiGo Flight: ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. విమానం ప్రమాదంలో పడిన కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. పాకిస్థాన్ గగనతల ప్రవేశానికి అనుమతి ఇచ్చిందా లేదా అన్న విషయాన్ని కూడా ఇందులో పరిశీలనలోకి తీసుకుంటోంది.
భారత్–పాక్ మధ్య సంబంధాలు ఇటీవల తిరిగి ఉక్కిరిబిక్కిరిగా మారాయి. భారత్ సింధూ జలాల ఒప్పందంపై గట్టి నిర్ణయాలు తీసుకుంటోంది. ఎయిర్‌స్పేస్ నిషేధాన్ని కొనసాగిస్తోంది. పాక్ మాత్రం భారత్‌ను విమర్శిస్తూ సింధూ నీళ్లు ఆపకండని ఒత్తిడి చేస్తోంది. ఇదే నేపథ్యంలో ఈ విమాన ఘటన సంభవించడంతో పాక్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

