Pakistan: భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలకంటే ఆర్థికంగా బలంగా ఉన్న పాకిస్థాన్, ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. తాజాగా వచ్చిన గణాంకాల ప్రకారం, పాకిస్థాన్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఇప్పుడు భారతదేశానికి చెందిన తమిళనాడు రాష్ట్రం జీడీపీ కంటే తక్కువగా ఉంది. ఈ విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
గత రెండు దశాబ్దాలుగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణిస్తోంది. తాజాగా, తమిళనాడు జీడీపీ మొత్తం పాకిస్థాన్ జీడీపీని మించిపోయినట్టు కనిపిస్తోంది. విశేషంగా ఏంటంటే, పాకిస్థాన్ జనాభా తమిళనాడు జనాభా కంటే సుమారుగా మూడింతలు ఎక్కువగా ఉన్నా, ఆర్థిక ప్రగతిలో మాత్రం తమిళనాడు ముందంజలో ఉంది. నివేదికల ప్రకారం, తమిళనాడులో సగటు వ్యక్తి ఆదాయం పాకిస్థాన్ సగటు ఆదాయంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
1995లో తమిళనాడు జీడీపీ సుమారు 15.7 బిలియన్ డాలర్లుగా ఉండగా, అదే సమయంలో పాకిస్థాన్ జీడీపీ 57.9 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, 2025 నాటికి ఈ తేడా పూర్తిగా మారిపోయింది. తాజా అంచనాల ప్రకారం, తమిళనాడు జీడీపీ 419.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 35.8 లక్షల కోట్లు)కి పెరిగింది. మరోవైపు, పాకిస్థాన్ జీడీపీ 397.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 33.9 లక్షల కోట్లు) వద్ద నిలిచిపోయింది.
ఇది కూడా చదవండి: Delhi: టర్కీకి మరో షాక్: సెలెబీ సంస్థకు సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు
ఈ అంశంపై నౌక్రీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందానీ స్పందిస్తూ, “పాకిస్థాన్ ప్రభుత్వం మరియు సైన్యం ఇకనైనా ఉగ్రవాదాన్ని, కశ్మీర్ అంశాన్ని పక్కనబెట్టి దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పెట్టుబడి పెడితేనే పాకిస్థాన్ ప్రజలకు మెరుగైన భవిష్యత్ లభిస్తుంది. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం మానితేనే దేశం ముందుకు సాగుతుంది” అని వ్యాఖ్యానించారు.
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, భారతీయ నెటిజన్లు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. “ఒక్క కోయంబత్తూరు విమానాశ్రయం అభివృద్ధి అయినా, ఆ ఒక్క ప్రాంతం జీడీపీనే పాకిస్థాన్ కంటే ఎక్కువ అవుతుంది” అని ఒకరు వ్యాఖ్యానించగా, “గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాకిస్థాన్ జీడీపీని దాటేశాయి” అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు.

