Pakistan: భారత్‌లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్‌కు తాజాగా భారీ షాక్ తగిలింది. ఆ దేశంలోని ప్రధాన జైలులో ఒకటైన కరాచీలోని మాలిర్ జైలు నుంచి సుమారు 216 మందికి పైగా ఖైదీలు పరారయ్యారు. వారిలో కరుడు గట్టిన నేరస్థులు ఉండటం ఆదేశాన్ని ఆందోళన కలిగిస్తున్నది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పారిపోయిన ఖైదీల కోసం వెతుకుతున్నారు.
Pakistan: పాకిస్థాన్ దేశంలోని కరాచీలో ఉన్న మాలిర్ జిల్లా జైలులో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకున్నది. తొలుతు భూకంపం రావడంతో ఆ జైలు బ్యారక్‌లలో ఉన్న ఖైదీలను బయటకు ఆవరణలోకి తీసుకొస్తుండగా, ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈలోగా ఒకవైపు గోడ కూలింది. ఇదే అదనుగా భావించిన ఖైదీలు గోడను బద్దలు కొట్టుకొని ఒక్క ఉదుటున ఆ గోడ కూలిన చోటు నుంచి బయటకు పరుగులు తీశారు.
Pakistan: ఖైదీలు పారిపోతుండగా, పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారని శబ్దాలు విన్న స్థానికులు తెలిపారు. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఖైదీలు పరారైన తర్వాత వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 50 మంది ఖైదీలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. కరాచీలోని మాలిర్ జైలు ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. గుర్తింపు కార్డులు చూపిన వారినే లోపలికి అనుమతి ఇస్తున్నారు. సింధ్ ప్రావిన్స్, ప్రిజన్స్ శాఖ మంత్రి అలీ హసన్ జర్దారీ.. జైలు ఘటనకు సంబంధించిన నివేదికను కోరారు.
Pakistan: భూప్రంకంపనలు ఎక్కువైన సమయంలో జైలులోని సర్కిల్ నంబర్ 4, 5 గదుల్లో ఉన్న ఖైదీలను జైలు అధికారులు, సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వివిధ బ్యారక్‌లలో ఉన్న 600 మంది ఖైదీలు గదుల నుంచి బయటకు వచ్చేశారు. వారిలో నుంచే 216 మంది ఖైదీలు పరారైనట్టు అధికారులు చెప్తున్నారు. పరారైన ఖదీల్లో కరుడు గట్టిన నేరస్థులు ఉండటంతో దేశంలో అల్లకల్లోలం చెలరేగే అవకాశం ఉన్నదని ఆ దేశ ప్రభుత్వం భావిస్తున్నది.