Operation Sindhu: మధ్యప్రాచ్యంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచ దృష్టి ఆ ప్రాంతంపై కేంద్రీకృతమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం హుటాహుటిన ‘ఆపరేషన్ సింధు’ అనే ప్రత్యేక చర్య చేపట్టింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతుండగా, ఇప్పటికే 110 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించారు.
దిల్లీకి చేరిన తొలి బాచ్ – 110 మంది భారతీయుల రాక
ఇండిగో విమానయాన సంస్థ ప్రత్యేకంగా నడిపిన 6E 9487 ఫ్లైట్ నేడు ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరింది. ఈ విమానంలో ఉన్న 110 మంది భారతీయుల్లో 90 మంది జమ్మూకాశ్మీర్‌కు చెందిన విద్యార్థులు. కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి వారికి స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Cm revanth: మాకు Noc ఇస్తే ప్రాజెక్టుకు అమద్దుచెప్పం
భద్రతకే ముఖ్య ప్రాముఖ్యత: టెహ్రాన్ నుంచి విద్యార్థుల తరలింపు
టెహ్రాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల రక్షణ కోసం భారత ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేపట్టింది. “విద్యార్థుల భద్రత మా ప్రథమ కర్తవ్యమని భావిస్తున్నాం. టెహ్రాన్‌లోని రాయబార కార్యాలయం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారిని భద్రంగా తరలించింది,” అని ఎంఈఏ ప్రకటనలో పేర్కొంది.
ఇరాన్-అర్మేనియా ప్రభుత్వాలకు భారత ధన్యవాదాలు
ఈ ఆపరేషన్ సజావుగా సాగేందుకు సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ తరలింపులో జరిగిన అంతర్రాష్ట్ర సహకారం అభినందనీయమని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.