Pakistan: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ జకోబాబాద్ వద్ద జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి తీవ్ర ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై ఐఈడీ పేలుడు సంభవించగా, ఈ పేలుడు తాలుకూ ఉగ్రదాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడు ప్రభావంతో క్వెట్టా నుండి పెషావర్‌కు వెళ్తున్న ఈ రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పడం కలకలం రేపింది.
దుండగుల ఘోర కుట్ర
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం — ఇది సాదా ప్రమాదం కాదు, ముందుగా పధకంతో అమర్చిన ఐఈడీ బాంబే కారణమని తేలుతోంది. బాంబు బలంతో రైల్వే ట్రాక్‌లో సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు జరిగిన సమయంలో రైలు జకోబాబాద్ వద్దకు చేరుకుంటుండగా ఘటన చోటుచేసుకుంది.
ప్రయాణికులలో భయాందోళనలు
ఘటన జరిగిన వెంటనే రైలులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పిందన్న భావన వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి.
ఇది కూడా చదవండి: Operation Sindhu: ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయులు
ఇదే రైలుపై మళ్లీ దాడి.. ఇదేం పరంపర?
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఇది ఈ ఏడాదిలో రెండో దాడిగా నిలిచింది. మార్చి నెలలో, పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఈ రైలును హైజాక్ చేసి, వందలాది ప్రయాణికులను బందీలుగా మార్చిన విషయం తెలిసిందే. అప్పుడు వారిని రక్షించేందుకు వచ్చిన పాక్ భద్రతా దళాలపై తీవ్రదాడి జరిగి, 214 మంది సైనికులు హతమయ్యారని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఆ తర్వాత పాక్ ఆర్మీ చేసిన భారీ ఆపరేషన్‌లో బందీలను విడిపించారు.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఈ తరహా దాడులు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు మార్గాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్న వేళ, ప్రయాణికుల భద్రతపై పాక్ ప్రభుత్వానికి పెనుప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.