Yadagirigutta: యాదాద్రి జిల్లా, యాదగిరిగుట్ట మండలం, పెద్దకందుకూరులో ఉన్న ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో జరిగిన ప్రమాదం ఒక కార్మికుడి ప్రాణాలను బలిగొంది. మంగళవారం ఉదయం ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికుడు బాయిలర్ స్టీమ్ పైపును తెరుస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో సదానందం (50) అనే కార్మికుడు అక్కడికక్కడే మరణించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రతీ రోజు మాదిరిగానే ఉదయం 7.30 గంటలకు బాయిలర్ స్టీమ్‌ను మరో ప్లాంట్‌కు మళ్లిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. స్టీమ్ పైపు మూతను విప్పుతుండగా అది పగిలిపోయి, దానిలోని భాగాలు సదానందం తలకు బలంగా తగిలాయి. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడు సదానందం స్వస్థలం గోదావరిఖని అని, గత 25 ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కుటుంబం ఆలేరు పట్టణంలో నివాసం ఉంటోందని వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

