Women Borrowers: భారతదేశంలో రుణాలు తీసుకునే మహిళల సంఖ్య గడచిన ఐదు సంవత్సరాల్లో 22% పెరిగింది. వీరిలో ఎక్కువ మంది పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనుండి రుణాలు తీసుకున్నారు. సోమవారం విడుదలైన నివేదిక ప్రకారం, మహిళలు తీసుకునే రుణాల్లో ఎక్కువ శాతం వ్యక్తిగత అవసరాలు, వినియోగ రుణాలు, గృహ రుణాలు ఉన్నాయి. అయితే, వ్యాపార రుణాల కోసం తీసుకునే రుణాల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.
నివేదిక ప్రకారం, 2024లో తీసుకున్న మొత్తం రుణాల్లో 42% వ్యక్తిగత, వినియోగ, గృహ రుణాలు కాగా, 38% రుణాలు బంగారం తాకట్టు పెట్టడం ద్వారా పొందినవి. వ్యాపారాల కోసం రుణాలు తీసుకునే మహిళల సంఖ్య పెరుగుతుండటంతో, 2019 నుంచి వ్యాపార రుణ ఖాతాల సంఖ్య 4.6 రెట్లు పెరిగినప్పటికీ, మొత్తం రుణాల్లో వాటి వాటా కేవలం 3% మాత్రమే ఉంది. అయితే, మహిళల్లో ఆర్థిక అవగాహన పెరుగుతున్న సూచనగా, డిసెంబర్ 2024 నాటికి 2.7 కోట్ల మంది మహిళలు తమ రుణాలను ట్రాక్ చేస్తున్నారని నివేదిక వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Dhananjay Munde Resigned: మంత్రి ధనంజయ్ ముండే అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు?
మహిళా రుణగ్రహీతలలో 60% మంది పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని, ఈ మార్పు లోతైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యువతర మహిళలు కూడా తమ రుణాలను పర్యవేక్షించడంలో ఆసక్తి చూపిస్తున్నారని నివేదిక పేర్కొంది.
మహిళా వ్యవస్థాపకతకు ఆర్థిక సహాయం అందుబాటులో ఉండటం ప్రాధాన్యత కలిగి ఉందని, సమానమైన ఆర్థిక అవకాశాలను అందించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరింత సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ ప్రతినిధులు సూచించారు. మహిళల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ఆర్థిక ఉత్పత్తులను రూపొందించడం, విధాన పరమైన మార్పులు తీసుకురావడం ద్వారా ఈ వృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని నివేదికలో సూచించారు.