MLC Kavitha

MLC Kavitha: కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్..

MLC Kavitha: తెలంగాణ రాజకీయ వేడి మంగళవారం ఉదయం ఇందిరా పార్క్ వద్ద మరింత ఉత్కంఠ రేపింది. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై జారీ చేసిన నోటీసులను నిరసిస్తూ నిర్వహించిన ఈ ధర్నా, రాష్ట్ర రాజకీయాల్లో నూతన చర్చకు దారి తీసింది.

కవిత తీవ్ర స్థాయిలో కేంద్రం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. “ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్. అభివృద్ధిని విమర్శల బలి చేయాలన్న కుట్ర ఇది,” అంటూ మండిపడ్డారు. తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం మహత్త్వాన్ని కవిత గుర్తుచేశారు

కవిత మాట్లాడుతూ, “కాళేశ్వరం కేవలం మూడు బ్యారేజీలు కాదు. ఇది 21 పంప్ హౌజ్‌లు, 15 రిజర్వాయర్లు, 200 కిమీ టన్నెల్లు, 1500 కిమీ కాలువలు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇందులో వాడిన మట్టితో 300 పిరమిడ్లు, స్టీల్‌తో 100 ఐఫిల్ టవర్లు, కాంక్రీట్‌తో 50 బుర్జు ఖలీఫాలు కట్టవచ్చు,” అని చెప్పారు.

“ప్రాజెక్టు పూర్తైతే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు లభిస్తాయి. 40 టీఎంసీల నీటితో హైదరాబాద్‌కు శాశ్వతంగా సాగునీరు అందుతుంది. 16 టీఎంసీలతో పరిశ్రమలకు నీళ్లు అందించే ఈ ప్రాజెక్టు మీద విచారణలు రాజకీయ కుట్రల మూలమే,” అని వివరించారు.

మెఘా కృష్ణా రెడ్డిపై ప్రశ్నలు – కాంగ్రెస్‌పై గరంగా

కవిత మాట్లాడుతూ, “90 శాతం పంప్ హౌజ్ పనులను చేసిన మెఘా కృష్ణా రెడ్డిని విచారణకు పిలవాలన్న ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. నిజంగా శుద్ధత కోసం అయితే, అన్ని దిశలలో విచారణ జరగాలి. కానీ కాంగ్రెస్‌ కేవలం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుంది,” అని విమర్శించారు.

ఇది కూడా చదవండి: Jagan Tenali Tour: 2.0.. తెనాలి నుండే మొదలుపెట్టిన జగన్‌!

ఏపీ జలదోపిడిపై నిరసన – ఈటలపై విమర్శలు

బకనచర్ల ప్రాజెక్టు, గోదావరి–పెన్నా అనుసంధాన పథకాల ద్వారా ఏపీ చేస్తున్న నీటి దోపిడీని తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం నడిపే జలదోపిడిపై తెలంగాణ బీజేపీ నోరు మెదపకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. “ఈటల రాజేందర్ ఒక్క మాటైనా మాట్లాడలేదు. తెలంగాణ బిడ్డగా బకనచర్లను అడ్డుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావాలి,” అంటూ ఆయనపై విమర్శలు గుప్పించారు.

జాగృతి అంటే ప్రభుత్వానికి భయం ఎందుకు?

ధర్నాకు వస్తున్న కార్యకర్తలను అరెస్టు చేయడం దుర్మార్గమని, ఇది ప్రభుత్వం భయంతో చేస్తున్న చర్య అని కవిత మండిపడ్డారు. “హైదరాబాద్‌లో ఆపితే గల్లీల్లో ధర్నాలు చేస్తాం. గోదావరి జలాల్లో వెయ్యి టీఎంసీల హక్కు సాధించేవరకు జాగృతి పోరాటం ఆగదు,” అని స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *