DCP Sadhana Rashmi: పోలీసుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మహంకాళి దేవాలయం నుండి ముత్యాలమ్మ ఆలయం వరకు మూడు వేలమంది తో హిందూ ధార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారని ఆమె తెలిపారు. శాంతియుతంగా హిందూ ధార్మిక సంఘాలు బంద్ కు పిలుపిచ్చిన తరుణంలో ముత్యాలమ్మ ఆలయం వైపుకు వచ్చిన కొంతమంది ఆందోళనకారులు ఒకసారిగా దూసుకురావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని తెలిపారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కు చెందిన కార్యకర్తలు రెండు భాగాలుగా విడిపోయి నిందితుడు బస చేసిన మెట్రోపాలిస్ హోటల్ పై దాడికి పాల్పడ్డారని, కొంతమంది ఆలయం వైపు ఉన్న మరో ప్రార్ధన మందిరం పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆమె తెలిపారు.
ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తమ మాట వినిపించుకొక పొగా రాళ్లు విసిరారని తప్పని సరి స్థితిలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకే లాఠీచార్జ్ చేసినట్లు స్పష్టం చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు జరిగిన పరస్పర దాడులలో ఇరు పక్షాలకు గాయాలు కాగా ఐదు మంది పోలీస్ అధికారులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. స్థానికులు కాకుండా బయట నుండి వచ్చిన వ్యక్తులు ఆందోళనలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు సైతం ధ్వంసం చేశారని తెలిపారు. పోలీసులపై ఆర్టీసీ బస్సు పై దాడులకు పాల్పడ్డ వారిని సీసీ కెమెరాలు ఆధారంగా గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. పరిస్థితులు సద్దుమనిగే వరకు ప్రతి ఒక్కరు సంయమానంతో ఉండాలని ఆమె సూచించారు.

