Kim Jong Un: ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ఉత్కంఠను రేపుతోంది. నాలుగేళ్లుగా సాగుతున్న ఈ ఘర్షణ కొత్త మలుపు తిరిగింది. ఇటీవల ఉక్రెయిన్ చేపట్టిన “ఆపరేషన్ స్పైడర్ వెబ్”తో రష్యా వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లతో భారీ దాడులు చేసింది. ఈ దాడిలో పలు రష్యా బాంబర్లు ధ్వంసమయ్యాయి. దీంతో రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటన నేపథ్యంలో రష్యా ప్రతీకారం తీర్చేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ పరిస్థితుల్లో ఉత్తరకొరియా నుంచి రష్యాకు దిశానిర్దేశం చేసే స్థాయిలో మద్దతు వెల్లువెత్తింది. బుధవారం ప్యాంగ్యాంగ్‌లో ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ను రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు కలిసి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కిమ్, “ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ఎలాంటి షరతులు లేకుండా మద్దతిస్తాం” అని స్పష్టం చేశారు. అంతేకాదు, అంతర్జాతీయ రాజకీయ అంశాల్లో రష్యా విధానాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కిమ్ మరోసారి వెల్లడించారు.
ఈ భేటీలో ఇద్దరూ వ్యూహాత్మక భాగస్వామ్యం, కుర్స్క్ ప్రాంత పునర్నిర్మాణం వంటి అంశాలపై చర్చించారని ఉత్తరకొరియా మీడియా పేర్కొంది. ఇది షోయిగు ఈ ఏడాదిలో ఉత్తరకొరియా సందర్శించిన రెండోసారి కావడం విశేషం. ఇప్పటికే మార్చిలో కూడా ఇలాంటి భేటీ జరిగింది. అప్పుడే కిమ్ రష్యా సార్వభౌమాధికారానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: చంద్రబాబు పిలుపు: పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
రష్యా తరఫున ఉత్తరకొరియా సైన్యం యుద్ధరంగంలో ఉక్రెయిన్ బలగాలను ఎదుర్కొంటున్నదీ అధికారికంగా ధ్రువీకరించబడిన విషయం. ఏప్రిల్‌లోనే ఉ.కొరియా ఈ విషయాన్ని ప్రకటించగా, రష్యా కూడా ఇందుకు సమ్మతించింది. అయితే ఏ స్థాయిలో బలగాలు ఉన్నాయి అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఉక్రెయిన్ నిఘా శాఖతో పాటు దక్షిణ కొరియా వర్గాల అంచనా ప్రకారం 10,000 నుంచి 12,000 ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధం చేస్తున్నారు. ఈ మద్దతుకు ప్రతిగా అత్యాధునిక ఆయుధాల సరఫరా ద్వారా రష్యా కిమ్‌కు మద్దతు ఇస్తోందన్న వాదనలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ముగింపు పలికేందుకు సౌదీ అరేబియా, ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉక్రెయిన్ ఇటీవల నిర్వహించిన డ్రోన్ దాడులు చర్చల పట్ల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు మసకబారుతున్నాయి. ఉత్తరకొరియా మద్దతుతో రష్యా మరింత బలపడగా, ఉక్రెయిన్ కూడా తన దాడులను మరింత వేగవంతం చేస్తోంది. అటు ప్రపంచం మొత్తానికి ఈ యుద్ధ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.