Nitish Kumar Reddy: బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో తెలుగు కుర్రాడు నితీస్ కుమార్ రెడ్డి దుమ్ము రేపుతున్నాడు.ఆడుతోంది తొలి టెస్టు సిరీసే అయినా.. ఎక్కడా భయం లేకుండా నితీశ్ ఆడుతున్న తీరుకు పలువురు ఫిదా అవుతున్నారు.మహా మహా సీనియర్లే తడబడిన కంగారూ పిచ్‌లపై ధాటిగా ఆడుతూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు నితీశ్ రెడ్డి. ఇటు బౌలింగ్ లోనూ రాణిస్తూ ..ఆల్ రౌండర్ గా భారత్ సుదీర్ఘ కాలం సేవలందిస్తానని తన ఆటతీరుతో చాటి చెబుతున్నాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో టెస్టును చేజార్చుకుంది.. ఆసీస్ పేస్ కు రోహిత్ సేన దాసోహమంటున్నా.. ఒక్కడు మాత్రం ఆ టీమ్ కు కొరకరాని కొయ్యలా ఎదురు నిలుస్తున్నాడు. అతడే నితీశ్‌కుమార్ రెడ్డి . ఆడుతున్నది అరంగేట్ర సిరీసే అయినప్పటికీ.. ఎంతో అనుభవమున్న ఆటగాడిలా ఆడుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.ఆస్ట్రేలియా ను వారి సొంత గడ్డపైనే ఎదుర్కోవడం అంటే అరుదైన అవకాశం. ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టిన ఏడున్నర నెలల్లో నితీశ్ ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్నాడు. కఠినమైన కంగారూ పిచ్ లపైనా సత్తా చాటుతూ కెరీర్ ను ఆశాజనకంగా ప్రారంభించాడు.
ఇది కూడా చదవండి: Bima Sakhi Yojana: ఎల్ఐసీ బీమా సఖి పధకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
Nitish Kumar Reddy: ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ టెస్టులో నితీశ్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే తొలి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఈ తెలుగు కుర్రాడు చివరి వరకూ నిలిచి జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో చూడచక్కటి షాట్లు ఆడుతూ 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 150 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలర్లు విజృంభించి ప్రత్యర్థి జట్టును 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ 38 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఔరా అనిపించాడు. జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించి అబ్బుర పరిచాడు.
ఇక భారత్ పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైనప్పటికీ.. నితీశ్ ఇన్నింగ్స్ భారత్‌కు ఊరట కలిగించింది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైనా.. నేనున్నానంటూ ముందుకు వచ్చిన మన తెలుగు కుర్రాడు మరోసారి నిలకడగా రాణించాడు. అడిలైడ్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లకు సహకరించిన పిచ్‌పై బ్యాటర్లు ఇబ్బందిపడిన వేళ.. ఎంతో ఓపికగా ఆడుతూ.. విలువైన 42 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇది కూడా చదవండి: Supreme Court: పంజాబ్ రైతుల పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
Nitish Kumar Reddy: ఇక రెండో ఇన్నింగ్స్ సమయంలో భారత్ ఓటమి ఖాయమైనా.. ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ పేస్ వ్యూహానికి టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ మరోసారి తనదైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 42 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఓటమి తప్పించి పరువు కాపాడాడు. ఇక ఈ రెండు టెస్టుల్లో 185 పరుగులు సాధించిన యశస్వి జైస్వాల్ తర్వాత 163 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ జాబితాలో రెండో స్థఆనంలో నిలిచాడు. అటు బంతితోనూ రెండు వికెట్లు తీసి ఆకట్టుకుంటున్నాడు. ఇలాగే నిలకడగా తన ఆట తీరును కొనసాగిస్తే.. టీమ్‌ఇండియాకు మరో గొప్ప ఆల్‌రౌండర్ దొరికినట్లేనని మాజీ ప్లేయర్లు అంటున్నారు.