Chandrababu Naidu

Chandrababu Naidu: ప్రపంచానికే డేటా హబ్‌గా విశాఖ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపై మరోసారి తన మార్కు విజన్‌ను చాటుకున్నారు. విశాఖపట్నం నగరం త్వరలోనే ప్రపంచానికే ఒక పెద్ద ‘డేటా హబ్’ గా మారబోతోందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన ‘MSME గ్రోత్ సమ్మిట్ 2026’ సదస్సుకు హాజరైన చంద్రబాబు, రాబోయే రోజుల్లో ఏపీని టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్‌గా ఎలా నిలబెట్టబోతున్నామో వివరంగా పంచుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని ఒక ప్రత్యేక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను సరికొత్త టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగానే దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటమ్ కంప్యూటర్’ ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతికి రాబోతోందని వెల్లడించారు. అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కేంద్రంగా మారుస్తామన్నారు. అలాగే, పుట్టపర్తి నుంచి బెంగళూరు వరకు ఉన్న ప్రాంతాన్ని డిఫెన్స్ హబ్‌గా మార్చబోతున్నామని, ఇక్కడ విమానాల తయారీకి సంబంధించిన విడిభాగాల పరిశ్రమలు వస్తాయని వివరించారు. కూటమి ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల లోపే 23 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సహజ వనరులు, అనుకూలతలను బట్టి వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని ఏకంగా రూ.1,00,000 కోట్ల పెట్టుబడులతో భారీ హార్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. పర్యాటక రంగం గురించి మాట్లాడుతూ.. బాపట్లలోని సూర్యలంక బీచ్‌ను గోవాను మించిన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పాపికొండల నుంచి భద్రాచలం వరకు, అలాగే గండికోట వంటి అద్భుతమైన ప్రదేశాలలో టూరిజం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ జిల్లా కలెక్టర్ ఎక్కువ ఎంఎస్ఎంఈ పార్కులు తెస్తారనే దానిపై వారి మధ్య పోటీ కూడా పెట్టినట్లు చెప్పారు.

యువతలో సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు ‘స్టార్టప్’ సంస్కృతిని తీసుకొస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ నుండి కనీసం 100 యూనికార్న్ సంస్థలను తయారు చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. గ్రామాల నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు ఏపీ ఉత్పత్తులు వెళ్లాలని ఆకాంక్షించారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నామని, ప్రఖ్యాత ‘బిట్స్ పిలానీ’ (BITS PILANI) తన సరికొత్త క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతోందని సంతోషకరమైన వార్త పంచుకున్నారు.

చివరగా నేటి తరం యువతను ఉద్దేశించి చంద్రబాబు కీలక సందేశం ఇచ్చారు. యువతకు ఉన్న ఆసక్తులు, ఆశయాలను ప్రభుత్వానికి చెబితే తగిన అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇష్టపడి పనిచేస్తే ఏదీ కష్టం కాదని, టెక్నాలజీతో పాటు జీవితంలో ఆధ్యాత్మిక దృక్పథం కూడా ముఖ్యమని హితవు పలికారు. ప్రపంచస్థాయి నైపుణ్యాలను మన యువతకు అందించి, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ ‘స్కిల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *