Telangana Film Chamber: ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మనస్ఫూర్తిగా అభినందించింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (APFDC) నూతన ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన పి. భరత్ భూషణ్‌తో పాటు బోర్డు డైరెక్టర్లకు చాంబర్ ప్రతినిధులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తుకు ఎంతో సానుకూలమైన అడుగని వారు కొనియాడారు.
ఈ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేకంగా అభినందించింది. ముఖ్యంగా ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభ పరిస్థితులపై బాలయ్య వ్యక్తం చేసిన ఆవేదన అందరి హృదయాలను తాకిందని చాంబర్ ప్రతినిధులు పేర్కొన్నారు. పరిశ్రమను నమ్ముకున్న థియేటర్ల యజమానుల కష్టాలను ఆయన అర్థం చేసుకున్న తీరు అద్భుతమని కొనియాడారు.
ప్రస్తుత రోజుల్లో సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎలాంటి కష్టాలు పడుతున్నారో బాలకృష్ణ చాలా స్పష్టంగా, ధైర్యంగా ప్రస్తావించారని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ తెలిపింది. ఎన్నో థియేటర్లు ఖర్చులు భరించలేక మనుగడ కోసం పోరాడుతున్నాయని, కొన్ని థియేటర్లు మూతపడే పరిస్థితికి కూడా చేరుకున్నాయని బాలయ్య చెప్పిన మాటలు.. ఇండస్ట్రీలో ఉన్న అసలైన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయని వారు మద్దతుగా నిలిచారు.
తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రత్యేకమైన లేదా అదనపు సౌకర్యాలు కోరడం లేదని ఈ సందర్భంగా ఫిల్మ్ చాంబర్ స్పష్టం చేసింది. సినిమా రంగానికి వెన్నెముకలాంటి థియేటర్లను కాపాడేలా, అలాగే తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేసేలా ఒక న్యాయమైన, పారదర్శకమైన, స్థిరమైన వ్యవస్థ కావాలని మాత్రమే తాము కోరుకుంటున్నట్లు వివరించింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లు పడుతున్న ఇబ్బందులను బహిరంగ వేదికపై ప్రస్తావించి, ఎగ్జిబిటర్ల కష్టాలను అందరికీ తెలిసేలా చేసినందుకు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ రెండు రాష్ట్రాల్లోనూ సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
