Nitin Gadkari: నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ కీలక కామెంట్స్ చేశారు . తన మెదడు విలువ నెలకు ₹200 కోట్లు అని వ్యాఖ్యానించారు. డబ్బు కోసం తాను ఎలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదని, కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులతో నిజాయితీగా సంపాదించగలనని ఆయన అన్నారు. ఇథనాల్ వ్యాపారంలో తన కుమారులు ఉన్నారనే విమర్శలకు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు సమాధానం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
E20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధనంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని నితిన్ గడ్కరీ ఖండించారు. ఇది తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో నిర్వహిస్తున్న ‘డబ్బుతో కూడిన రాజకీయ కుట్ర’ అని ఆరోపించారు. E20 ఇంధనం సురక్షితమైనదని, వాహనాలకు ఎలాంటి హాని కలిగించదని, ఆటోమొబైల్ కంపెనీలు, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM), మరియు సుప్రీం కోర్టు కూడా దీనిని ధృవీకరించాయని ఆయన స్పష్టం చేశారు. E20 ఇంధనం వల్ల ₹22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గుతాయని, ఇది రైతులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: Howard Lutnick: జనాభాపై భారత్ గొప్పలు.. కానీ, మా దగ్గర ఒక్క మొక్కజొన్న బస్తా కూడా కొనదు
వాహనాల స్క్రాపేజ్ పాలసీని ప్రోత్సహించడానికి, పాత వాహనాలను తుక్కు కింద ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి అదనపు రాయితీలు ఇవ్వాలని గడ్కరీ ఆటోమొబైల్ కంపెనీలను కోరారు. ఇది కేవలం దానధర్మం కాదని, కొత్త వాహనాలకు డిమాండ్‌ను పెంచి, పరిశ్రమకు లాభాలను తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు. పాత వాహనాలను స్క్రాప్ చేయడం వల్ల ప్రభుత్వం, రాష్ట్రాలకు ₹40,000 కోట్ల వరకు జీఎస్టీ ఆదాయం వస్తుందని కూడా ఆయన చెప్పారు. పాత వాహనాలను స్క్రాప్ చేసి కొత్తవి కొనుగోలు చేసే వారికి జీఎస్టీలో మినహాయింపులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కూడా కోరినట్లు తెలిపారు.