Nirmal: ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంత కీలకమో మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో నివసిస్తున్న మామ గారు స్వగ్రామానికి వచ్చి వేసిన ఓటే తన కోడలి విజయానికి కారణమవడం విశేషం.
వివరాల్లోకి వెళితే, లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద పోటీ చేశారు. ఆమె మామగారు ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. కోడలు ఎన్నికల్లో నిలబడటంతో ఆమె గెలుపు కోసం ఆయన నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు.
సోమవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. గ్రామంలో మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలవగా, శ్రీవేదకు 189 ఓట్లు, ఆమె సమీప ప్రత్యర్థి హర్షస్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక ఓటును అధికారులు చెల్లనిదిగా ప్రకటించారు. దీంతో ఒక్క ఓటు తేడాతో శ్రీవేద సర్పంచ్‌గా విజయం సాధించారు.
అమెరికా నుంచి వచ్చి వేసిన ఆ ఒక్క ఓటే గెలుపును నిర్ణయించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యంలో ఓటు విలువను మరోసారి గుర్తు చేస్తూ ఆదర్శంగా నిలిచింది.

