Nimmala ramanaidu: పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఎడమ ప్రధాన కాలువ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఖరీఫ్ నాటికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతతో కృషి చేస్తోందన్నారు.
కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం వద్ద జరుగుతున్న పంపా ఆక్విడెక్ట్ నిర్మాణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయనతో పాటు ఇంజనీర్-ఇన్-చీఫ్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి పాల్గొన్నారు.
మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎడమ కాలువ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. “ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం పోలవరం ఎడమ కాలువను సందర్శించారు. జూన్ 25 నాటికి మొదటి దశ పూర్తిచేసి ఉత్తరాంధ్రకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా రూ.1200 కోట్లు మంజూరు చేసి, టెండర్లను ఖరారు చేసి, పనులను ప్రారంభించాం” అని వివరించారు.
ఎడమ కాలువ పనులను మొత్తం 8 ప్యాకేజీలుగా విభజించి, ఏకకాలంలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొన్నిచోట్ల పనులు సవాలుగా ఉన్నాయని, ముఖ్యంగా పంపా ఆక్విడెక్ట్ ప్రాంతంలో ఇటీవల వరకూ నీరు నిలిచిన కారణంగా, లోతైన ఫౌండేషన్ పనులు (100 అడుగుల లోతు) చేయడం కష్టంగా మారిందన్నారు.
ప్రధాన డ్యామ్‌లో డయాఫ్రం వాల్ నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి చెప్పారు. ఏప్రిల్ 20 నాటికి 200 మీటర్ల నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం రెండు కట్టర్లు పనిచేస్తుండగా మూడో కట్టర్ ఈ నెలాఖరులోపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 2025 నాటికి డయాఫ్రం వాల్ పూర్తిచేయడమే లక్ష్యమన్నారు.
మొత్తం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అనుకూల పరిస్థితులు ఏర్పడితే 2027 జూన్ నాటికి, గోదావరి పుష్కరాల సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.