AP NEW DISTRICSTS: ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు మార్కాపురాన్ని జిల్లా చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురాన్ని తప్పకుండా జిల్లా కేంద్రం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రావాలంటే 100 నుంచి 150 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరినా పట్టించుకోలేదు. హేతుబద్ధత లేకుండా జిల్లాల విభజన చేశారు. ఆ సమయంలో ఉద్యమించిన ప్రకాశం పశ్చిమ ప్రాంత ప్రజలకు టీడీపీ భరోసా ఇచ్చింది. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, వైపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన జిల్లాగా మారనుంది. వెలిగొండ పూర్తిచేస్తే సాగు, తాగునీటికి డోకా ఉండదు. పలు జాతీయ రహదారులు, రెండు రైల్వేలైన్లు, పశ్చిమాన నల్లమల అడవి, అంతకు మించి విస్తారంగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో పాటు ప్రతిపాదిత దొనకొండ కారిడార్, కనిగిరి నిజ్జా, తాజాగా ప్రకటించిన రిలయన్స్ బయో విద్యుత్ ప్లాంట్ ఆ పరిధిలోకి వస్తాయని మార్కాపురం ప్రాంత వాసులు ఆశలు పెట్టుకున్నారు.
మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు పలు ముఖ్య కారణాలు లేకపోలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 1970లో ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. 1972లో సమరయోధులు ప్రకాశం పంతులు పేరుమీద ప్రకాశం జిల్లాగా మార్చారు. ప్రస్తుత జిల్లా కేంద్రం ఒంగోలు. తాజాగా బాపట్ల జిల్లాలోకి వెళ్లిన చీరాల, పర్చూరు, అద్దంకి ప్రాంతాలను అప్పట్లో గుంటూరు జిల్లా నుంచి విడదీశారు. కొండపి, కందుకూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని కొంత ప్రాంతాన్ని అప్పటి నెల్లూరు జిల్లా నుంచి బయటకు తీశారు. గిద్దలూరు, మార్కా పురం, వైపాలెం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కర్నూలు జిల్లా నుంచి విడగొట్టారు. జిల్లా ఏర్పాటు సమయంలోనే విజ్ఞులైన అప్పటి కొందరు నాయకులు అంతో ఇంతో జిల్లాకు నడిబొడ్డున ఉన్న పొదిలిని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక నాయకుడి పలుకుబడితో ఒంగోలును జిల్లా కేంద్రంగా చేశారు. ఆ తర్వాత పొదిలిని కనీసం డివిజన్ కేంద్రగానైనా చేయాలని డిమాండ్ వచ్చినా పట్టించుకోలేదు. ఒకప్పుడు మార్కాపురం కేంద్రంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గం కూడా పునర్విభజనలో రద్దయింది.
Also Read: Team Jagan VS Janasena: పోల్చుకునేందుకు సి# ఉండాలి!
AP NEW DISTRICSTS: అయితే రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లాలో చేరిన తర్వాత ఆ ప్రాంత ప్రజల మనోభావాల్లో మార్పు వచ్చింది. ఆయా దశల్లో పాలనా వికేంద్రీకరణ జరిగిన సందర్భాల్లో జిల్లా కేంద్రం సుదూరంగా ఉండటం సమస్యగా మారి పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలనే డిమాండ్ ఉద్భవించింది. దీన్ని అదునుగా చేసుకొని 2019 ఎన్నికల ముందు వైసీపీ నాయకుడిగా జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. పైగా ఒక్క చాన్స్ అని చెప్పిన ఆయన్ను నమ్మి ఆ ప్రాంత వాసులు గత ఎన్నికల్లో వైసీపీకి భారీ ఆధిక్యం ఇచ్చారు. టీడీపీ జిల్లాలోని తూర్పు ప్రాంతంలోని నాలుగు స్థానాల్లో గెలుపొందగా, పశ్చిమ ప్రాంతాల్లో అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ప్రతిచోటా భారీ ఆధిక్యం లభించింది. ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వారే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టగా ఆ ప్రాంత ప్రజలు తమ డిమాండ్‌ను బయటపెట్టారు. మార్కాపురంతో పాటు గిద్దలూరు, వైపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలను కలిపి ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో అధికార వైసీపీ నేతలు మౌనవ్రతం పాటించారు. టీడీపీ నాయకులు అటు మార్కాపురం, ఇటు ఒంగోలు కేంద్రంగా 6 నియోజకవర్గాలకు ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. కానీ వీటన్నింటినీ వైసీపీ సర్కారు పెడచెవిన పెట్టింది.
ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తమ ప్రభుత్వం రాగానే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీని ప్రస్తావిస్తూ ముందుకు సాగడంతో పశ్చిమ ప్రాంతంలో టీడీపీ ఘన విజయాలు సాధించింది. అనంతరం ఎన్నికలలో ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం ప్రత్యేక జిల్లా గా ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో పశ్చిమ ప్రాంత ప్రజలు వారి చిరకాల స్వప్నమైన మార్కాపురం జిల్లా కాబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

