Delhi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏపీ భవన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. “రీ డవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్” పేరుతో డిజైన్ల కోసం టెండర్లు పిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలకు విభజించే విషయం పక్కాగా నిర్ణయించుకునే పనిలో పడ్డారు.
సార్వత్రిక ఎన్నికల ముందు, రెండు రాష్ట్రాల అధికారులు భవన్ విభజనపై చర్చించి, కేంద్ర హోంశాఖ నుంచి ఆమోదం కూడా తెచ్చుకున్నారు. ఇంతకాలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలసికట్టుగా డిల్లీలో ఉన్న భవనాలను వినియోగించుకుంటున్నాయి. ఇక కొత్త భవన్ అవసరం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణ పనులపై ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రస్తుతం గోదావరి, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడి హౌస్ వంటి మూడు ప్రదేశాల్లో కొత్త భవన్ నిర్మాణం చేపట్టేందుకు డిజైన్లను ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 11.53 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది రోడ్లు, భవనాల శాఖ.
ఈ రోజు సాయంత్రం లోపు ఆసక్తి ఉన్న కాంట్రాక్టర్లు తమ ‘ఎస్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ని సంబంధిత వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 28లోపు తమ ప్రతిపాదనలు సమర్పించాలని రహదారులు, భవనాల శాఖ విజయవాడ సర్కిల్ ఎస్ఈ స్పష్టం చేశారు.