Jathara: సతీష్‌బాబు నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ తో కలసి రాధాకృష్ణ ప్రొడక్షన్స్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదలైంది. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ తో తీసిన ఈ సినిమాను నవంబర్ 8న రిలీజ్ చేయబోతున్నారు. ‘అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్ళి పోయిందహో’ అనే దండోరాతో మొదలైన ట్రైలర్ లో ‘నువ్వు ఎక్కడి పడితే అక్కడ కట్టేసుకోవడానికి అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావారా?’, ‘తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకుని బతికే వాళ్లం కాదు’ అనే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమా కథకు తగ్గట్టుగా ఆర్ఆర్, విజువల్స్ ఉన్నాయి. దియారాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఆర్.కె. నాయుడు, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ ముఖ్య పాత్రధారులు. శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్న ‘జాతర’ సినిమాగానూ ఆకట్టుకుంటుందేమో చూడాలి.