NATS New President

NATS New President: నాట్స్ నూతన అధ్యక్షునిగా శ్రీహరి మందడి ప్రమాణస్వీకారం

NATS New President: గొప్ప సంకల్పం, ఆశయం బలంగా ఉంటే ఎంతటి అసాధారణ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని నిరూపించిన మహనీయులు కొందరే ఉంటారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తి, మనందరి ఆత్మీయ శక్తి శ్రీహరి మందాడి. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించి, నిరంతర కృషి, అంకితభావంతో నేడు ప్రపంచ ఖ్యాతిని గడించి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ప్రతి తెలుగు వ్యక్తి గర్వించదగ్గ విషయం. ఆయన ప్రస్థానం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు, అదొక స్ఫూర్తిదాయక పయనం. సేవకు అంకితమైన జీవితానికి, ఉన్నత ఆశయాలతో కూడిన నాయకత్వానికి శ్రీహరి మందాడి నిలువెత్తు నిదర్శనం.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో మందాడి సీతారామయ్య, విజయలక్ష్మి దంపతులకు జన్మించిన శ్రీహరి, పుట్టుకతోనే సిరిసంపదలతో తులతూగలేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా, ఆయనలో చిన్నతనం నుంచే అసాధారణ లక్షణాలు తొణికిసలాడేవి. చదువుల్లోనూ, ఆటల్లోనూ చురుగ్గా ఉంటూ, క్లాస్ లీడర్‌గా, స్కూల్ లీడర్‌గా నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. ఈ తొలి అడుగులే ఆయన భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన పునాదులు వేశాయి. చెన్నైలో ఎంసీఏ పూర్తి చేసి, ఉద్యోగం కోసం అమెరికా గడ్డపై అడుగుపెట్టారు. అక్కడ ఒక సాధారణ ఉద్యోగిగా మాత్రమే కాకుండా, తనదైన విజన్‌తో సొంతంగా కంపెనీని స్థాపించి, ఐటీ రంగంలో అగ్రగామిగా ఎదిగారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ, తన విజయానికి మూలమైన సమాజానికి తిరిగి ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనను నిత్యం వెంటాడింది. ఆ తపనతోనే 2010లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) వైపు తన అడుగులు పడ్డాయి.

NATS: నాట్స్ నూతన అధ్యక్షునిగా శ్రీహరి మందడి ప్రమాణస్వీకారం

నాట్స్‌లో ఒక సాధారణ సభ్యుడిగా తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీహరి, ఆ సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొంటూ తన అంకితభావాన్ని చాటుకున్నారు. 2011లో నాట్స్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించినప్పుడు, వాటిని విజయవంతంగా నిర్వహించి సంస్థ ప్రశంసలు అందుకున్నారు. న్యూజెర్సీలో తెలుగువారికి ఏ ఆపద వచ్చినా, నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా సేవలందించేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. న్యూజెర్సీలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, ఆటల పోటీలు, క్యాన్సర్ అవగాహన సదస్సులు, ఆర్థిక అవగాహన కార్యక్రమాలు, బాలల సంబరాలు, మహిళా సంబరాలు వంటి ఎన్నో కార్యక్రమాలను శ్రీహరి మందాడి ముందుండి నడిపించారు. ఆయన చొరవ, నిస్వార్థ సేవను గుర్తించిన నాట్స్ నాయకత్వం, ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలను అప్పగించింది. నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్‌గా బోస్టన్, కనెక్టికట్, హారిస్‌బర్గ్ ప్రాంతాల్లో నాట్స్‌ను విస్తరించడంలో ఆయన కృషి ప్రశంసనీయం. నాలుగు సార్లు నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా సేవలందించి, అమెరికాలోని ఇతర తెలుగు సంఘాల నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరివాడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు జాతి ఐక్యతకు, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన కృషి అజరామరం.

ALSO READ  Digital Snan at Maha Kumbhamela: ఎవడండీ ఈడు ఇలా ఉన్నాడు.. ఫోటోలకు స్నానం  చేయించి పుణ్యం వచ్చింది పొమ్మంటున్నాడు!

2.jpg
ఎంత ఎత్తుకు ఎదిగినా, శ్రీహరి తాను పుట్టిన గడ్డను, తన మాతృభూమిని ఎన్నడూ మర్చిపోలేదు. గుంటూరు జిల్లాలోని తన స్వగ్రామం కట్టమూరుపై ఆయన మమకారం అనిర్వచనీయం. అక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించి, పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా, పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసి వారి విద్యాభివృద్ధికి దోహదపడ్డారు. కట్టమూరులో అభివృద్ధి పనులకు తనవంతు ఆర్థిక సహాయం అందించి, తన సామాజిక బాధ్యతకు నిజమైన అర్థం చెప్పారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల నిర్వహణకు వేసే కమిటీల్లో శ్రీహరి కీలక సభ్యుడిగా తమ వంతు కృషి చేశారు. ఆయన అకుంఠిత దీక్ష, అంకితభావం నాట్స్ బోర్డును ప్రభావితం చేశాయి.

నాట్స్ కోసం శ్రీహరి పడ్డ కష్టం, చేసిన కృషికి ఫలితంగా, నాట్స్ బోర్డు అత్యున్నతమైన అధ్యక్ష పదవిని శ్రీహరి మందాడికి అప్పగించింది. ఈ పదవిని ఒక బాధ్యతగా భావించి, ఆయన నాట్స్ కోసం నాలుగు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. తెలుగు యువతలో సేవా స్ఫూర్తిని రగిలించి, వారిని సామాజిక సేవలో భాగస్వామ్యం చేయడలో భాగంగా ప్రెసిడెన్షియల్ సర్వీస్ వాలంటీర్ అవార్డుకు తెలుగు విద్యార్థులను నాట్స్ ద్వారా ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించి, వారికి ఆర్థిక రక్షణ కల్పించడం కోసం అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థుల రక్షణ కోసం భీమా కల్పించే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. వలస వచ్చిన తర్వాతి తరాలకు తెలుగు భాషను, సంస్కృతిని అందించాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉండే తెలుగు పిల్లలకు తెలుగు భాషను నేర్పించేలా ప్రత్యేక యాప్‌తో శిక్షణ ఇవ్వడం కోసం తన కార్యాచరణను సిద్ధం చేశారు. అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో తెలుగువారికి నాట్స్ సేవలను అందుబాటులోకి తేవడం కోసం నాట్స్ చాప్టర్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ నాలుగు లక్ష్యాలను సాధించే దిశగా శ్రీహరి మందాడి దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. నాట్స్‌ను తన కుటుంబంగా భావించే శ్రీహరి మందాడి, ఆ కుటుంబ సంక్షేమం కోసం, ఉన్నతి కోసం నిస్వార్థంగా నిత్యం శ్రమిస్తున్నారు. ఆయన నాయకత్వంలో నాట్స్ మరింత బలోపేతం అవుతుందని, తెలుగు ప్రజలకు మరింత చేరువవుతుందని, ప్రపంచ స్థాయిలో తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *