Donthi Madhava Reddy: సాధారణంగా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎమ్మెల్యేనైనా… ఎంపీ అయినా…మంత్రులైనా… మర్యాద పూర్వకంగా కలుస్తుంటారు.. కానీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం నేనింతే అంటున్నారు. సీఎం అయితే నాకేంటి అన్నట్లు… సొంత పార్టీ ముఖ్యమంత్రిని లైట్ తీసుకుంటు నిత్యం చర్చగా మారుతున్నారు.
తెలంగాణ రాజకీయాలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నిత్యం హాట్ టాపిక్‌గా మారతారు. సీఎం వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా వ్యవహారం మారింది.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెక్రటేరియేట్‌కు వెళ్లి సీఎంకు శుభాకాంక్షలు తెలపని ఈ ఎమ్మెల్యే ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో అధికారిక పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనను కనీసం మర్యాద పూర్వకంగా కూడా కలవకపోవడం జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికి మూడు సార్లు సీఎం వరంగల్‌కు వచ్చిన ఆయనను మాత్రం ఎమ్మెల్యే కనీసం మర్యాద పూర్వకంగా కలవక పోవడం విశేషం.
ఇది కూడా చదవండి: Power Plant: కూటమిలో పవర్ వార్..సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం వివాదం
Donthi Madhava Reddy: సీఎం రేవంత్ రెడ్డి vs ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మధ్య ఈ తరహా సన్నివేశం ఇదే ప్రథమం కాదు.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో కూడా సేమ్ సీన్ జరిగింది. ములుగు నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. నర్సంపేట మీదుగా మహబూబాబాద్‌కు పాదయాత్ర వెళ్లాల్సి ఉండగా నర్సంపేటలో రేవంత్ రెడ్డికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం ఆయనను ఆహ్వానించలేదు.దీంతో నియోజకవర్గం జంప్ చేసి.. మహబూబాబాద్‌లో రేవంత్ రెడ్డి తన పాదయాత్ర చేపట్టారు.గత ఎన్నికల సమయంలో కూడా నర్సంపేటకి రేవంత్ రెడ్డి ప్రచారానికి రాలేదు.
పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభలో ఆరుగురు ఎమ్మెల్యేలు హాజరరయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. సీఎం అయితే నాకేంటి అన్నట్టు లైట్ తీసుకున్నారు.ఎవరేమనుకుంటే నాకేంటి నేనింతే… నాకు నచ్చినట్టు నేనుంటా… నిక్కచ్చిగా ఉంటా… అన్నట్లు దొంతి మాధవరెడ్డి వ్యవహార శైలి రాజకీయ చర్చకు దారితీస్తోంది.దొంతి మాధవరెడ్డి వ్యవహారాన్ని కొందరు మూర్ఖత్వం అంటుంటే కాదు కాదు మొండోడు అని మరి కొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఆయన రూటే సపరేట్ అంటున్నారు.
అయితే దొంతి మాధవరెడ్డి సీఎంని కలవక పోవడం వెనుక మంత్రి పదవే ప్రధాన కారణం… తెలంగాణ కాంగ్రెస్‌కు ఆయూపట్టుగా ఉన్న తనకు అన్యాయం చేశారని ఆగ్రహంతో ఉన్నారట… జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లైతే పార్టీని కాపాడారో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను కూడా అదే రీతిలో కాంగ్రెస్‌కి అండగా ఉన్నా… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేసినప్పుడు నేనెందుకు ముఖ్యమంత్రిని గౌరవించాలని భావనతో ఉన్నారని సమాచారం. మంత్రి పదవి రాకపోవడం మీద కీలకంగా ఆయన అలిగి ఉన్నారు. ఎమ్మెల్యేగా అందరితోపాటే తనకు కూడా నిధులు వస్తాయి. తాను ప్రత్యేకంగా సీఎం కలవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి.. అందుకే సీఎంను కలవడానికి ఆసక్తి చూపడం లేదని చర్చ జరుగుతుంది.