Nara Lokesh: విశాఖ నగర పరిధిలో పరిశ్రమల రంగం మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్‌లోని హిల్ నెంబర్ 3 వద్ద సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ (Sify Infinit Spaces Limited) 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మాణానికి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో 3.6 ఎకరాల భూమిలో రెండు దశల్లో ప్రాజెక్టును నిర్మించనుంది. దీని ద్వారా వెయ్యిమందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని లోకేష్ తెలిపారు.
విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యం
శంకుస్థాపన అనంతరం జరిగిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ – “విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా మలచడం మా ముఖ్య లక్ష్యం. 2047 నాటికి గ్రేటర్ విశాఖ ఆర్థిక వ్యవస్థ 1 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుంది. ఈ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం మేము చేస్తాం” అని అన్నారు.
అంతేకాక, “రాష్ట్రానికి వచ్చే 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులలో 50 శాతం విశాఖకే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, స్టార్టప్ రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ధ్యేయం” అని తెలిపారు.
5 లక్షల ఐటీ ఉద్యోగాల లక్ష్యం
లోకేష్ ప్రకటించినదేమంటే – వచ్చే ఐదు సంవత్సరాల్లో విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తామని. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, కాంటిజెంట్, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Mamata banerjee: అమ్మాయిలు రాత్రి వేళలో బయట తిరగొద్దు
నవంబర్‌లో టీసీఎస్ కొత్త సెంటర్ ప్రారంభించనున్నదని, కాంటిజెంట్ సీఈవో ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. అదేవిధంగా గూగుల్ టీం కూడా వచ్చే వారం విశాఖకు వస్తోందని, పెట్టుబడులపై చర్చించనున్నదని వివరించారు.
పరిశ్రమలకు అనుకూల వాతావరణం
“పరిశ్రమలకు ఉత్తమ విధానాలు, పారదర్శక పాలనతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కారు బుల్లెట్ రైలులా దూసుకెళ్తోంది. ఆర్థిక సంస్కరణల్లో కేంద్రం ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది” అని లోకేష్ పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని, త్వరలో పూర్తి సామర్థ్యంతో నడపాలన్నదే లక్ష్యమని తెలిపారు.
గ్రేటర్ ఎకనమిక్ జోన్ – భవిష్యత్తు కేంద్రం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలను కలిపి గ్రేటర్ విశాఖ ఎకనమిక్ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో మల్టినేషనల్ కంపెనీలకు కీలక కేంద్రంగా మారుతుందని చెప్పారు.
విశాఖ – హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి
“హైదరాబాద్ అభివృద్ధికి 30 సంవత్సరాలు పట్టింది. కానీ విశాఖకు పది సంవత్సరాలు చాలు. సమగ్ర ప్రణాళిక, పారదర్శక పాలన ఉంటే విశాఖను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దగలం” అని లోకేష్ స్పష్టం చేశారు.
2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన లోకేష్, “ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయి. వాటిలో సగం విశాఖకే వస్తాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన బాట” అని అన్నారు.