Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో కలిసి శనివారం (మే 17) నాడు ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేష్‌తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్Prime Minister Modi నివాసమైన 7 లోకకల్యాణ్ మార్గ్‌కి సాయంత్రం 7:20కి చేరుకున్నారు. ఈ భేటీ దాదాపు రెండు గంటల పాటు సాగింది.
ఈ సందర్భంగా మోదీ, లోకేష్ కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడారు. ముఖ్యంగా చిన్నారి దేవాన్ష్‌ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. బ్రాహ్మణి, దేవాన్ష్ శ్రేయోభిలాషలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశం అనంతరం వీరంతా కలిసి విందులో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర “యువగళం” ఆధారంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పుస్తకంలో 2024 ఎన్నికలకు ముందు 3,132 కిలోమీటర్ల మేర సాగిన యువగళం పాదయాత్ర విశేషాలను వివరించారు.
లోకేష్ ఈ సమావేశాన్ని “మరపురాని అనుభవం”గా పేర్కొన్నారు. ప్రధాని మోదీ చూపిన ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పురోగతికి మార్గదర్శకత్వం ఇవ్వాలని ప్రధానిని కోరారు. అలాగే వికసిత్ భారత్ – 2047 లక్ష్యాన్ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ తమవంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్: నా జోక్యంతోనే భారత్-పాక్ అణుయుద్ధం ఆగింది
Nara Lokesh: ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, అమరావతి పునర్నిర్మాణం, సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ప్రధాని మోదీకి లోకేష్ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి పాలన విషయమై ప్రధానికి తెలియజేశారు. మోదీ కూడా రాష్ట్ర ప్రగతికి పూర్తి మద్దతు అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ భేటీ మోదీ, లోకేష్ మధ్య నెలకొన్న రాజకీయ, వ్యక్తిగత అనుబంధాన్ని ప్రతిబింబించడమే కాక, రాష్ట్రానికి మరింత మద్దతు లభించే అవకాశాలను కలిగించింది.