Nara lokesh: ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సాక్షి పత్రికపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఇవాళ విశాఖపట్నం 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. అయితే, సాక్షి తరఫు న్యాయవాది వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ కేసు విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా పడింది.అనంతరం నారా లోకేశ్ విలేకరుల సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లోకేశ్ మాట్లాడుతూ, “యువగళం పాదయాత్రలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా. యువగళం పాదయాత్ర తర్వాత కూడా ప్రజల్లో ఉండాలని నా కోరిక. అందుకే ప్రజాదర్బార్ ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తున్నాను,” అని పేర్కొన్నారు.
“తల్లి, చెల్లి పైనే నమ్మకం లేని జగన్ రెడ్డికి తన పార్టీలో నాయకులపై ఏం నమ్మకం ఉంటుంది? డబ్బుల కోసం పార్టీని కూడా అమ్మేస్తున్నారు. వైసీపీలో నాయకులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కక్షసాధింపు చేయడం నా ఉద్దేశం కాదు. కానీ అక్రమాలపై దర్యాప్తు జరుగుతోంది, ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి,” అని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
కాకినాడ పోర్టు, విశాఖ భూకబ్జాలు, గాలి సాంకేతిక లోపాలు వంటి అనేక అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని, న్యాయం కోసం చట్ట ప్రకారం చర్యలు కొనసాగుతాయని నారా లోకేశ్ స్పష్టం చేశారు. “గత ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలు వెలుగులోకి రావడం అనివార్యం. ప్రతీ అంశాన్ని పకడ్బందీగా విచారిస్తాం,” అని ఆయన అన్నారు.