Nara lokesh: నాలుగు ఏళ్లలో ఏపీ ఐటీ విభాగంలో 10 లక్షల ఉద్యోగాలు

Nara lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) స్థాపన ద్వారా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉండవల్లి నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, జీసీసీలు, డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు దేశ విదేశాల నుండి 95 ప్రముఖ సంస్థలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులకు సిద్ధమై ఉన్నాయని లోకేశ్ తెలిపారు. ఈ సంస్థలకు అనుమతులు, మౌలిక సదుపాయాలు తదితర అవసరాలు వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో భూములు కేటాయించారని, వీటి కార్యకలాపాలు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తాజాగా బెంగళూరులో జరిగిన పర్యటన సందర్భంగా ఏఎన్‌ఎస్‌ఆర్, సత్వ వంటి సంస్థలతో జీసీసీ కేంద్రాల ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయని, వీటి ద్వారా 35,000 మందికి ఉపాధి కలగనుందని మంత్రి చెప్పారు. ఈ ఒప్పందాల ఆధారంగా యూనిట్ల స్థాపనపై నిరంతరం అనుసంధానం కొనసాగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్న, మధ్యతరహా సంస్థల కోసం 26 జిల్లాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ త్వరలో ప్రారంభం

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ కేంద్రంతో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో ప్రాంతీయ ‘స్పోక్స్’ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అమరావతి క్వాంటమ్ వ్యాలీలో టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు.

ఓర్వకల్లో డ్రోన్ సిటీ – ఏడాదిలో పూర్తి లక్ష్యం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించబోయే డ్రోన్ సిటీ కోసం 400 ఎకరాల భూమిని కేటాయించామని, ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయం, పోలీసింగ్, వాతావరణ విభాగాల్లో డ్రోన్‌ల వినియోగాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రతి నెల ఒక జిల్లాలో అవగాహన ఈవెంట్లు నిర్వహించాలని సూచించారు.

మనమిత్ర సేవలు మరింత విస్తరణకు కార్యాచరణ

పౌరసేవల్లో విప్లవాత్మక మార్పునకు దోహదపడుతున్న మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తరించాలన్నారు. ఇప్పటివరకు అందిస్తున్న 702 సేవల్లో 535 సేవలు మనమిత్ర ద్వారా ప్రజలకు అందుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, కుల ధృవీకరణ, విద్యాసంబంధిత సర్టిఫికెట్లు బ్లాక్‌చైన్‌ సాంకేతికతతో మనమిత్రలో పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ

రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించాలని, ప్రధాన ఎయిర్‌పోర్టులైన విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాల్లో నిరవధిక మొబైల్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *