Nara lokesh: ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. నారా లోకేశ్ మాట్లాడుతూ, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు దగ్గరగా తెలుసుకున్నానని, రాజకీయాల్లో పాదయాత్ర ఎంబీయే కోర్సు లాంటిదని వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్ల నిర్ణయాల్లో పరిపూర్ణత సాధించానని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నానని తెలిపారు.
విశాఖపట్నంలో డేటా సెంటర్ – వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ఖాయమని, దీని ద్వారా ఏపీ ఐటీ రంగంలో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.
వైటూకే విప్లవంలో హైదరాబాద్ లబ్ధి పొందినట్లుగానే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు కూడా అదే అవకాశమని అన్నారు.
పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యా విధానంలో కేజీ నుంచి పీజీ వరకు మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు.
వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చినదని, ఈ నెలాఖరుకల్లా “మన మిత్ర” ద్వారా 350 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
కుల ధ్రువీకరణ పత్రాలు, హాల్ టికెట్లు, భూ రికార్డులు వంటి పత్రాలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబునాయుడు అడ్వాంటేజ్
నారా లోకేశ్ మాట్లాడుతూ, “కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు, ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇదే మా పెద్ద అడ్వాంటేజ్” అని అన్నారు.
ఇటీవల టాటా పవర్‌తో ఏపీ ప్రభుత్వం 7 గిగావాట్ల ఒప్పందం కుదుర్చుకుందని, దీని ద్వారా పరిశ్రమల అవసరాలకు మెరుగైన సాంకేతిక పరిష్కారాలు లభిస్తాయని తెలిపారు.
నైపుణ్య గణన (Skill Mapping) కంటే కుల గణన (Caste Census) సులభం అని, ఏపీలో నైపుణ్య గణనను ఛాలెంజ్‌గా తీసుకుని పని చేస్తున్నామని పేర్కొన్నారు.
మంగళగిరిలో ఘన విజయం
1985 నుంచి టీడీపీ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో 2019లో పోటీ చేసి ఓడిపోయానని, కానీ 2024లో 91 వేల మెజారిటీతో గెలిచి మూడో అత్యధిక మెజారిటీ సాధించానని తెలిపారు.
“హెచ్ఆర్డీ శాఖ చాలా కష్టమైనది. అయినప్పటికీ, దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తున్నాను” అని పేర్కొన్నారు.
“నా భార్య బ్రాహ్మణి నా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తోంది” అని హాస్యభరితంగా అన్నారు.
“మహిళా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతిరోజూ జరుపుకోవాలి” అని నారా లోకేశ్ అన్నారు.